శ్రీరాంపూర్, ఏప్రిల్ 26 : తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) సంక్షోభంలో చిక్కుకున్నది. విద్యుత్ బకాయిలే కాకుండా, టీజీజీఈఎన్సీవో (జెన్కో)కు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించి దాదాపు రూ.30,000 కోట్ల చెల్లింపులు నిలిచిపోవడం సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. బీఆర్ఎస్ సర్కారులో బొగ్గు బకాయిల చెల్లింపులు క్రమబద్ధంగా ఉండగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టింపులేని తనంతో పెండింగ్‌లో పడిపోవడంపై కార్మికలోకం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అటు విద్యుత్ బకాయిలు, ఇటు బొగ్గు బకాయిలు కలిపి రూ. 55,000 కోట్లకు పైగా చేరుకోగా, సింగరేణి రోజూవారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
అగ్రిమెంట్ రద్దు చేస్తేనే..
జైపూర్‌లోని 800 మెగావాట్ల మూడో యూనిట్ విద్యుత్‌ను తెలంగాణ డిసమ్లకు కాకుండా రాజస్థాన్‌కు విక్రయించాలని సింగరేణి నిర్ణయించుకున్నది. ఇదే సూత్రాన్ని బొగ్గు సరఫరా విషయంలోనూ అమలు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. టీజీజీఈఎన్సీవోకు బొగ్గు ఇచ్చినా డబ్బులు రానప్పుడు, వారితో ఉన్న ఫ్యూయల్ సపె్లై అగ్రిమెంట్ (ఎఫ్ఎస్ఏ)నుసీఎండీ తక్షణమే రద్దు చేయాలనే డిమాండ్ వస్తున్నది. జెన్కోకు ఇచ్చే బొగ్గును తక్షణమే నిలిపివేసి, నగదు చెల్లించే ఇతర రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు లేక ఓపెన్ మారెట్ (ఈ వేలం)లో విక్రయిస్తే తక్షణమే నిధులు అందుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత రాష్ట్ర సంస్థ అయినందున ఉచితంగా బొగ్గును సరఫరా చేస్తూ పోతే, చివరకు సింగరేణి మూతపడే ప్రమాదమున్నది. ఒక తెలంగాణ ప్రభుత్వ సంస్థ (ఎస్సీసీఎల్), మరో తెలంగాణ ప్రభుత్వ సంస్థ (టీజీజీఈఎన్సీవో)ను నమ్మలేని స్థితికి రావడం.. రాష్ట్ర పాలనా యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనంగా ఉన్నది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి, లేదా సింగరేణికి తన బొగ్గును బయట అమ్ముకునే పూ ర్తి స్వేచ్ఛను ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నది.
కుంభకోణాలకు కేరాఫ్‌గా
సింగరేణి కుంభకోణాలకు కేరాఫ్‌గా మారుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ అధికారి హయాంలో వ్యవస్థల విధ్వంసం రూ. వేల కోట్ల టెండర్ల మాయాజాలం, పెనాల్టీల మాఫీ కోసం మాస్టర్ సెచ్లు, విచారణను అడ్డుకుంటున్న ముగ్గురు అధికారుల సిండికేట్! దీంతో సింగరేణిలో అక్రమాలు, అవినీతి కుంభకోణాలకు స్థావరంగా మారుతుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) చరిత్రలో గత పరిపాలనా కాలం ఒక చీకటి అధ్యయంగా మారుతోంది. ఒక మాజీ అధికారి నేతృత్వంలో సాగిన ఈ అరాచక పాలనలో, నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనే ఆరోపణలున్నాయి. తన సన్నిహితులకు, రాజకీయ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సదరు అధికారి రూపొందించిన అక్రమ వ్యూహాలు ఇప్పుడు ఒకొకటిగా బయటపడుతున్నాయి. ఇందారంఖని (ఐకే ఓసీపీ) కుంభకోణంలో రూ. 25 కోట్ల పెనాల్టీ మాఫీ కుట్ర జరుగుతుంది.
ఇందారంఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపు పనుల్లో జరిగిన అక్రమాలు అత్యంత దారుణమైనవిగా ఉన్నాయి. ఈ పనులు దక్కించుకున్న వరాహా, జీకేఆర్, జీవీ అనే సంస్థ కేవలం 30 శాతం పనులే పూర్తి చేసింది. ఫలితంగా సింగరేణి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కోల్పోవాల్సి వచ్చింది. వైఫల్యానికిగాను విధించాల్సిన రూ. 25 కోట్ల జరిమానాను మాఫీ చేసేందుకు మాజీ అగ్రస్థాయి అధికారి ఒక ఫేక్ కమిటీని వేసి పెనాల్టీ తప్పించే ప్రయత్నం చేశారు. శ్రీరాంపూర్ డీజిల్ సామ్లో గతంలో నిందితుడిగా ఉన్న అధికారిని ఈ కమిటీకి హెడ్‌గా నియమించి, ఫోర్స్ మేజర్ (అనివార్య కారణాలు) పేరిట జరిమానా మాఫీ చేయాలని నివేదిక ఇప్పించారనే ఆరోపణలున్నాయి. గతంలో కుంభకోణంలో బా ధ్యుడైన అధికారి (దోషికే) బాధ్యతలు అప్పగించారని విమర్శలున్నాయి. విజిలెన్స్ విభాగం ఈ కుట్రను బయటపెట్టినప్పటికీ, సదరు మాజీ అధికారి ఆ విచారణ నివేదికను రికార్డుల్లో లేకుండా తొకిపెట్టారని ఆరోపణలున్నాయి.
రూ.650 కోట్ల కాంట్రాక్టులో..
థర్మల్ పవర్ ప్లాంట్లలో కాలుష్య నియంత్రణ కోసం ఏర్పాటు చేసే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) కాంట్రాక్టులో నిబంధనలను తమకు నచ్చినట్లు మార్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సంస్థకు కేటాయించిన రూ.650 కోట్ల కాంట్రాక్టులో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారు. ఒప్పందం కుదిరిన తర్వాత, సంస్థకు లబ్ధి చేకూర్చేలా ప్రైస్ వేరియేషన్ క్లాజులను సవరించి పక్షపాతం చూపించారు. పరికరాల సరఫరాలో జాప్యం జరిగినందుకు విధించాల్సిన జరిమానాను అక్రమంగా మాఫీ చేస్తూ, గడువును కూ డా ఎలాంటి కారణం లేకుండా పొడిగించారు.
రూ. 320 కోట్ల టెండర్లలో మతలబు..
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే గనిలో ఓవర్ బర్డెన్ తొలగింపు కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ అనుమానాస్పదంగా సాగింది. రూ. 320 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించి ప్రైస్ బిడ్లను పలుమార్లు వాయిదా వేశారు. తమకు కావాల్సిన సంస్థకు కాంట్రాక్టు దకేలా ఇతర కంపెనీలను నిరుత్సాహపరిచేందుకు ఈ జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యమై సంస్థకు నష్టం వాటిల్లింది.
కొత్త నిబంధనల పేరిట గేట్ కీపింగ్
రామగుండం ఏరియాలోని ఓపెన్ కాస్ట్ టెండర్లలో ఇతర సంస్థలను పోటీ నుంచి తప్పించేందుకు ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. టెండర్ దాఖలు చేసే ముందే స్థానిక ఏరియా జీ ఎం నుంచి సైట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్ పొందాలనే నిబంధనను తెచ్చారు. పోటీని అడ్డుకోవడానికి కేవలం తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు మా త్రమే ఈ సర్టిఫికెట్లు ఇప్పించి, మిగిలిన వారిని టెండర్ ప్రక్రియకు అనర్హులుగా మార్చే కుట్రలకు తెరలేపారు. పరిపాలనా విభాగంలో అర్హులైన సీ నియర్లను పకనబెట్టి, తనకు అత్యంత సన్నిహితులకు పదోన్నతులు కల్పించారనే ఆరోపణలు న్నాయి.
జీఎం-ఏజీఎం దంపతుల వ్యవహారం
మాజీ అధికారి వద్ద ఏడేళ్లుగా పని చేస్తున్న ఓ మహిళా అధికారికి, ఆమె సీనియారిటీలో 8వ స్థానంలో ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఏజీఎంగా పదోన్నతి కల్పించారు. ఆమె పెర్ఫార్మెన్స్ రిపోర్టును ఆమె భర్తే (జీఎం ఫైనాన్స్) రాయగా, దానిని సదరు మాజీ అధికారి ఆమోదించడం సంస్థలో నైతిక పతనానికి నిదర్శనం. దీనిపై నిరసన తెలిపిన వారిని బెదిరింపులకు గురిచేశారు. నిజాయితీగా పనిచేసే అధికారులను వేధించడానికి విజిలెన్స్ విభాగాన్ని ఒక శిక్షా విభాగంగా మార్చారని ఆరోపణలు సైతం ఉన్నా యి. విజిలెన్స్ వేధింపులు తట్టుకోలేక ఎస్టీపీపీ అధికారి కిరీటి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఈ కేసులో నిజాలు బయటకు రాకుం డా సదరు మాజీ అధికారి పోలీసు వ్యవస్థపై ఒ త్తిడి తెచ్చారని ఆరోపణలున్నాయి. ప్రస్తుత యాజమాన్యం ఈ అక్రమాలపై విచారణను వేగవంతం చేస్తుండగా, పాతతరం అధికారులు ము గ్గురు సిండికేట్‌గా దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. సింగరేణిలో కుంభకోణం అంశం విలువ (3 వేల కోట్లు) ప్రధాన ఆరోపణ ఉంది. ఎక్స్‌ప్లోజివ్ టెండర్ రూ. 2,800 కోట్లు తమకు నచ్చిన సంస్థల కోసం ని బంధనల మార్పు, ఎఫ్‌జీడీ కాంట్రాక్ట్ రూ. 650 కోట్లు అక్రమ పెనాల్టీ మాఫీ, ప్రైస్ వేరియేషన్ సవరణలు, కేటీకే ఓబీ పనులు రూ. 320 కోట్లు ప్రైస్ బిడ్లలో ఉద్దేశపూర్వక జాప్యం, ఇందారంఖని పెనాల్టీ రూ. 25 కోట్లు జేవీ సంస్థను కాపాడేందుకు ఫేక్ కమిటీ ఏర్పాటు. సింగరేణిలో పాతుకుపోయిన ఈ అవినీతి గనిని వెలికితీయాలంటే కేవలం అంతర్గత విచారణ సరిపోదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తేనే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని టీబీజీకేఎస్, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.