తాండూర్ : నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు ( Roads ), వంతెనల ( Bridges ) సమస్యను పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం (Singareni authorities ) యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది . కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి , ఐఎన్టీయూసీ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ నేతృత్వంలో పలువురు నాయకులు సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి ని కలిసి రోడ్లు, బ్రిడ్జి ల సమస్య తీవ్రతను వివరించారు .
సానుకూలంగా స్పందించిన జీఎం ఆదేశాల మేరకు గోలేటి ఏరియా వర్క్ షాప్ ఏజీఎం కృష్ణమూర్తి, ఎస్ఈ నరేష్, బీపీఏ ఓసీపీ-2 మేనేజర్ మహేష్‌లు భీమన్న వాగు , లచ్చుగూడెం వాగు లను పరిశీలించారు . అత్యవసరంగా సమస్యలను పరిష్కరించేవిధంగా లచ్చుగూడెం వద్ద ఇనుప బ్రిడ్జి ని త్వరితగతిన ఏర్పాటు చేసేలా చూస్తామని కృష్ణమూర్తి పేర్కొన్నారు .
భీమన్నవాగులో భారీగా పేరుకుపోయిన పూడికను నీటి ప్రవాహం తగ్గగానే తొలగిస్తామన్నారు . పూడిక తొలగిస్తే బ్రిడ్జి సమస్య ఉండబోదన్నారు . ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేలా అన్ని రకాల చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు . సింగరేణి అధికారుల వెంట సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సూరం దామోదర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జగదీశ్ ,గిరిజన నాయకులు ఎం పర్బత్ రావు, మాణిక్ రావు, భగవంత్ రావు, గంగు పటేల్, గంగు, శంకర్, అమృత్ రావు, పర్బత్ రావు, టి తిరుపతి, ఎం తిరుపతి, జె రాజం, సుంగు తదితరులున్నారు .