ఆదిలాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా పత్తి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. కూలీల కొరత ప్రధా న సమస్యగా మారింది. వానకాలంలో 4.13 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు, వర్షాలు సాగుకు సహకరించడం, పంట లో తెగుళ్లు, చీడ పురుగుల నివారణలో రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో దిగుబడి బాగా వస్తున్నది. ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి చేతికొస్తుందని రైతులు అంటున్నారు. రైతులు అక్టోబర్ మొదటి వారం నుంచి పత్తిని తీస్తూ ఇండ్ల వద్ద నిల్వ ఉంచుతున్నారు. అక్టోబర్ 25వ తేదీన కొనుగోళ్లు పారంభం కాగా.. రోజు పది క్వింటాళ్ల పత్తి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వస్తున్నది. తేమ శాతం అధికంగా ఉండడంతో పత్తిని ఎండబెట్టి విక్రయానికి తీసుకొస్తున్నారు. తక్కువ సం ఖ్యలో పత్తి వస్తుండడంతో మార్కెట్ యార్డులో కాంటాలు ఖాళీగా కనిపిస్తున్నాయి.
పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా.. పంటను తీయడానికి కూలీల కొరత వేధి స్తున్నది. రైతులందరూ ఒకేసారి పత్తి తీయాల్సి రావడంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో వారికి రోజువారీ కూలీ కా కుండా కిలోల చొప్పున చెల్లించాల్సి వస్తున్నది. కిలో పత్తి తీస్తే రూ.10 చొప్పున రైతులు చెల్లి స్తున్నారు. ఒక్కో కూలీ రోజు 60 కిలోల వరకు పత్తి తీస్తుండగా.. దీంతో వారికి రూ.600 వర కు గిట్టుబాటు అవుతుందని రైతులు అంటు న్నారు. పత్తి తీసేవారిని ఆదిలాబాద్ పట్టణం లోని వివిధ ప్రాంతాలతో పాటు మండల కేం ద్రాల నుంచి ఆటోలో తీసుకొస్తున్నామని, ఆ టో కిరాయి కూడా తామే భరించాల్సి వస్తుం దని రైతులు ఆవేదన చెందు తున్నారు. జిల్లాలోని తాంసి, తలమడుగు, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో పలు గ్రామాల్లో రైతులు మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకొ స్తున్నారు.
నాకు మావల మండలంలోని బట్టిసావర్గాం శివారులో నాలు గెకరాల భూమి ఉంది. ఇందులో పత్తి సాగు చేశా. వారం రోజుల నుంచి పత్తి తీద్దామనుకుంటే కూలీలు దొరుకుతలేరు. దీంతో ఆదిలాబాద్ నుంచి కూలీలను పత్తి తీయడానికి తీసుకొచ్చా. ఆటో కిరాయితోపాటు కిలోకు రూ.10 చొప్పున చెల్లిస్తున్నా. గతేడాది రూ.7 నుంచి రూ.8 వరకు చెల్లించే వాళ్లం.
– భూమారెడ్డి, రైతు