తాండూర్ : ఎరువుల కంపెనీల (Fertilizer Company) యాజమాన్యాల తీరు వల్ల రైతులు, షాపుల డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆంక్షలు విధించడం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం తాండూర్ మండలంలో డీలర్లు సీడ్స్, ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు.
మండల కేంద్రంలోని తాండూర్ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫర్టిలైజర్ సంఘం మండల అధ్యక్షుడు బోనగిరి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బాలు ప్రసాద్ మారు, కోశాధికారి దత్తుమూర్తి, తాండూర్ మండల ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా నిర్వహించిన బంద్ లో భాగంగా డీలర్లు రైతుల సమస్యల పరిష్కారం కోసం తాండూర్ మండల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దుకాణా లు స్వచ్ఛందంగా మూసివేసినట్లు తెలిపారు. ఎరువుల ధరలు రోజు రోజుకూ భారమవు తున్నాయని, మరో వైపు కంపెనీలు వివిధ ఉత్పత్తులను లింక్ రూపంలో ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు భారం పడుతుందని వివరించారు.
రవాణా చార్జీలు ఎక్కువగా ఉన్నందున ఆ భారం డీలర్లపైన పడి నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఫర్టిలైజర్‌లో ఎఫ్ఓఎల్ క్రింద యూరియా, డీఏపీ కాంప్లెక్స్, ఫొటాస్ లింకు ప్రోడక్టులు ఇవ్వకుండా ఎరువులు సరాపరా చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువుల శాంపిల్స్ ఫెయిల్ అయితే కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తాండూరు మండల ఫర్టిలైజర్ షాపుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.