నార్నూర్, సెప్టెంబర్ 4 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మల్లంగి గ్రామానికి చెందిన జాడే శంకర్, జాదవ్ కృష్ణ, జాదవ్ మిథున్, జాదవ్ మిట్టు వ్యవసాయ పనులు ముగించుకొని బుధవారం సాయంత్రం ఇంటికి వస్తున్నారు. సమీపంలోని పెద్దవాగు దాటే క్రమంలో జాదవ్ కృష్ణ, జాదవ్ మిథున్, జాదవ్ మిట్టులు చిక్కుకున్నారు. ఈ ముగ్గురిని శంకర్ వాగు దాటించాడు.
ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో జాడే శంకర్(32) వాగులోనే చిక్కుకొని వరదకు కొట్టుకుపోయి చనిపోయాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ జాడి రాజాలింగం, ఎస్ఐ అఖిల్ ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.