ఆసిఫాబాద్/ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, నవంబర్ 20 : ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 7.3 డిగ్రీలు, ఆదిలాబాద్, నిర్మల్ జల్లాల్లో 9.2, మంచిర్యాలలో 9.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా, ప్రజానీకం గజగజ వణికిపోతున్నది.
ఉదయం తొమ్మిది గంటల దాకా మంచు కమ్ము కుంటుండగా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇక సాయంత్రం ఆరింటికే ఇగం మొదలవుతుండగా, రోడ్లపై సందడి తగ్గిపోతున్నది. మున్ముందు మరింత తీవ్రత పెరిగే అవకాశముండగా, వృద్ధుల్లో ఆందోళన మొదలైంది.