కౌటాల, మే 31 : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవా రం మండలంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను ఎంఏవో పాలకుర్తి రాజేశ్‌తో కలిసి తనిఖీ చేశారు. విత్తన డీలర్లు నిబంధనలు పాటించాలని, రైతులకు గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలోనూ నకిలీ విత్తనాలు అమ్మరాదని, అలా చేస్తే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు.
రైతులు విత్తనాలు కొనేసమయంలో తప్పకుండా ప్యాకెట్ వివరాలను పరిశీలించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. అన్ని దుకాణాల్లో బీజీ2 (బోల్ గార్డ్ 2) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. విత్తనాలు కొన్న తర్వాత తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సమాచారం అందించాలని కోరారు.