మంచిర్యాల అర్బన్, నవంబర్ 7 : బెల్లంపల్లికి చెందిన శివిని ఆమని (42) గత నెల 15న జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో చేరగా, వైద్యులు మూడు ఆపరేషన్లు చేశారు. గురువారం ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేయగా, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగి యాజమాన్యాన్ని నిలదీసిన విషయం విదితమే. ఈ విషయమై శుక్రవారం ‘నమస్తే’లో ‘నెలలో మహిళలకు మూడు ఆపరేషన్లు’ శీర్షికన కథనం ప్రచురితమవ్వగా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి హరీశ్‌రాజ్ స్పందించారు. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు వైద్య బృందం సభ్యులు డా.శివప్రసాద్, డా.అశోక్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు టచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని కలిసి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె రికార్టులను దాదాపు మూడు గంటల పాటు పరిశీలించారు. ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారు. విచారణ సమయంలో అధికారులు హాస్పిటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య బృందం అడిగిన ప్రశ్నలకు సిబ్బంది పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పాటు తర్జనభర్జన పడ్డారు. పూర్తి వివరాలను నివేదిక రూపంలో డీఎంహెచ్‌వోకు అందజేయనున్నట్లు వారు తెలిపారు.