మంచిర్యాల అర్బన్ : రాజయోగ సాధనతో ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతామని హైదారాబాద్ బ్రహ్మ కుమారి ఇన్చార్జి శక్తి బెహన్ (Shakti Behan) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా (Manchryala District) కేంద్రంలోని హైటెక్ సిటీలో ఉన్న బ్రహ్మకుమారీల (Brahma Kumari) భవనంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన బ్రహ్మా కుమారీస్ దివ్య దర్శన నిలయ భవనాన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బ్రహ్మకుమారీస్ శాఖల ప్రతినిధులు కులదీప్ దీదీ, కరీంనగర్ రీజియన్ ఇన్చార్జి విజయ్ బెహన్ జీ, పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంచిర్యాలలో గత 30 సంవత్సరాలుగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ధార్మిక, ఆరోగ్య, రైతు స్వగౌరవ సభలు, సామాజిక ప్రగతి కోసం అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని వివరించారు.
ఈ శాఖ సేవల ద్వారా అనేకమంది వ్యక్తిగత పరివారక జీవితంలో పొత్తులను అధిగమిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్నట్లు వెల్లడించారు. ఆధ్యాత్మిక జీవితం ద్వార లాభాన్వితులు కావాలనే సంకల్పంతో సొంత భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి మంచిర్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారి మంగీలాల్ సొమాని స్థలాన్ని అందజేసినట్లు తెలిపారు.
రేపు ఉదయం పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి గిరిజన సోదరుల నృత్యాల ద్వారా అతిథులకు స్వాగతం పలకనున్నట్లు, జిల్లా వాసులందరూ పాల్గొని భగవంతుని ప్రసాదమైన బ్రహ్మ భోజనం స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఇన్చార్జి రమా, కోరుట్ల ఇన్చార్జి రాజేశ్వరి, హైదరాబాద్ ధ్యాన ఇన్చార్జి నిర్మలా, పద్మ, రుచి, శ్రీవాణి, ప్రసాద్, సుధాకర్, పోషం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.