కౌటాల, మార్చి 27 : ‘అసలే చాలీ చాలని వేతనాలు.. 14 నెలలుగా ఇస్తలేరు. మేమంతా బతుకుడెట్లా.. పూట గడవడం దినదిన గండంగా మారింది. వేతనాలు వెంటనే విడుదల చేయాలి’ అంటూ పారిశుధ్య కార్మికులు (ఎన్ఎంఆర్) డిమాండ్ చేశారు. గురువారం సిర్పూర్(టీ) మేజర్ జీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిర్పూర్ పంచాయతీలో 12 మంది పారిశుధ్య కార్మికులం పనిచేస్తున్నామని, 14 నెలలుగా జీతాలు రాక కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నామని, తమ గోస పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ఇందుకు ఈవో తిరుపతి స్పందిస్తూ బిల్లులు పంపానని, బడ్జెట్ లేదని, ఓ రెండు రోజులు ఓపిక పట్టండని, ఉన్నతాధికారులతో మాట్లాడి జీతాలు వచ్చేలా చూస్తానని ఆయన తెలపడంతో కార్మికులు ఆందోళన విరమించారు.