నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలేపూర్, చిత్తగూడ గ్రామంలో పారిశుద్ధ్యం (Sanitation ) అస్తవ్యస్తంగా మారింది. వీధులలో డ్రైనేజీ ( Drainage ) లేకపోవడంతో మురుగు ఏరులై పారుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడవాల్సి వస్తుంది. పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టకపోవడంతో వీధులలో చెత్తాచెదారంతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి.

మురుగు నిల్వ ఉన్న ప్రదేశాలు దోమలకు నిలయంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. మురుగు నీరుతో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యాధుల బారినపడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించిన దాఖలాలు లేవని గ్రామస్థులు ఆరోపించారు.
అధికారులు చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. చెత్త సేకరణ, బ్లీచింగ్ పౌడర్ చల్లినా దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ లను నిర్మించి విధులను శుభ్రంగా ఉంచేలా చూడాలని కోరుతున్నారు.