బెల్లంపల్లి, సెప్టెంబర్ 15 : నిర్మాణ రంగంలో ఎంతో ప్రాధాన్యమున్న ఇసుక.. ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియ రెండు నెలలుగా నిలిచిపోయింది. నెన్నెల మండలం ఖర్జి వద్ద చెక్‌డ్యాం నిర్మాణంతో ఈ సమస్య మొదలైంది. ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ కార్మికులందరికీ ఉపాధి లేకుండా పోయింది. దీంతో నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాలకు చెందిన మూడువేల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రేపు, మాపు అనుమతులు వస్తాయని ఎదురుచూస్తూనే రెండు నెలలు గడిచిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేక అప్పు చేసి సరుకులు కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాగే ఉంటే రోడ్డున పడాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఇసుక బుకింగ్ ప్రక్రియ పునరుద్ధరించాలని కార్మికవర్గం వేడుకుంటున్నది.
నెన్నెల మండల ఖర్జీ ప్రభుత్వ రీచ్ నుంచి నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుంటారు. తమ అవసరాల మేర గృహ, భవన నిర్మాణాలు చేసుకుంటారు. అయితే ఖర్జీ వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చెక్‌డ్యాం నిర్మించింది. వర్షాకాలంలో చెక్‌డ్యాం ముందు నీరు నిలిచి బురదచేరడంతో రీచ్ దగ్గరకు ట్రాక్టర్లు వెళ్లి ఇసుక తీసుకురావడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ దారిగుండా నీరు నిలవడంతో ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి. రోడ్డు గుంతలుగా మారి ట్రాక్టర్లు అందులో కూరుకుపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఇసుక బుకింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు నిలిపివేశారు. దీంతో రెండు నెలలుగా గృహ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షాకాలం ముగిసే వరకు ఇలాగే ఉంటుందని మైనింగ్ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే యథావిధిగా రీచ్‌కు వెళ్లే మార్గం సుగుమమవుతుందని, ఇసుక ఆన్లైన్ ప్రక్రియను ఆప్పుడే పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలలు దాటాయని మరో రెండు నెలలు ఉపాధిలేకపోతే రోడ్డున పడాల్సి వస్తుందని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలోని నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాలతో పాటు ప ట్టణానికి చెందిన మూడు వేల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. తాపీ మేస్త్రీలు, కూలీలు, ప్లంబర్, వెల్డర్, సెంట్రింగ్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్లు, పీవోపీ వర్కర్లు, మా ర్బుల్ మేస్త్రీలు, పెయింటర్స్ ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు, ఇతర కార్మికులు ఇదే రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వీరే కాకుండా భవన నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణదారులు కూడా గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, తమకు ఆన్లైన్ ఇసుక బుకింగ్ ప్రక్రియ పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఆన్లైన్లో ఇసుక రాకపోకపోవడంతో భవన నిర్మాణ కార్మికులందరూ ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ వారీ కూలీతోనే బతికే కార్మికులు రెండు నెలులగా చాలీచాలనీ జీవనం గడుపుతున్నారు. కార్మికుల్లో 90 శాతం మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. భవన నిర్మాణానికి దాదాపు పది విభాగాలకుపైగా వివిధ పనులు చేసే వర్కర్లు ఉన్నారు. వారంతా ప్రస్తుతం రోడ్డున పడ్డారు. ఖర్జీకి వెళ్లే దారి ట్రాక్టర్లు కూరుకుపోకుండా చేసే పనులకు తమ సంఘం డబ్బు పెట్టుకుంటుంది. ఆ దారి సుగుమం చేసి, ఆన్లైన్ ప్రక్రియను కొనసాగించాలి.
– తాడిశెట్టి రాంకుమార్, తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు
ఎలక్ట్రీషియన్ పని మాత్రమే చేస్తా. ఏ ఇతర పనీ నాకు చేయడం రాదు. భవన నిర్మాణాలు కొనసాగితేనే ఉపాధి దొరికేది. పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ఒక్కడినే కాకుండా ఈ రంగంపై ఆధార పడ్డ చాలా మంది దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. మా దాంట్లో ఈ రోజు కూలీకి పోతే ఆ రోజు డబ్బు అన్నట్లు చాలా మంది ఉన్నారు. వారి పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. అధికారులు స్పందించి వెంటనే ఆన్లైన్ ఇసుకను తెప్పించేలా చూడాలి. వర్షాకాం పోయేదాకా అంటే మరో రెండు నెలలు ఆగాలి. అంతకంటే ముందే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
– మహ్మద్ సల్మాన్, ఎలక్ట్రీషియన్