నిర్మల్ అర్బన్, డిసెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరిట కాలయాపన చేస్తున్నదని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన వ్యకం చేశారు. తమ న్యాయమైన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చూస్తూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నది. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రుల ముఖచిత్రాలను ధరించి జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఉట్నూర్, డిసెంబర్ 18 : ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్(సీఆర్టీల) ఉద్యోగ భద్రత కల్పించాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనక అభిమాన్ అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో సీఆర్టీలు కొన్నేండ్లుగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ సింగ్, ఆడే నూర్సింగ్, నవీన్ యాదవ్, ప్రకాశ్, సునీల్, రవీందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.