ఇంద్రవెల్లి, డిసెంబర్ 26 ః సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గురువారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ముత్నూర్ గ్రామంలోని కుమ్రం భీం విగ్రహానికి ఫూలమాల వేసి నివాళులర్పించారు. సంప్రదాయ వాయిద్యాల మధ్య మహా పాదయాత్రతోపాటు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు ఐదు కిలో మీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. తుడుందెబ్బ నాయకులతోపాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు ముందుగా అమరవీరుల జెండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అమరవీరులకు నివాళులర్పించారు.
భారీగా తరలివచ్చిన ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరేత్తించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిండిగల్ యాదగిరి మాట్లాడుతూ.. 17 రోజులుగా సమ్మె చేస్తున్నా రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం విడ్డూరమన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కో-కన్వీనర్ గోడం గణేశ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పోరాటానికి తమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదేరావ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేట్టి మనోజ్, జిల్లా ప్రచారకార్యదర్శి గేడం భరత్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణుక, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర, తుడుందెబ్బ మండలాధ్యక్షులు పుర్కా చిత్రు, తుడుందెబ్బ మండల గౌరవ అధ్యక్షులు జుగ్నాక్ భరత్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, జిల్లా అధ్యక్షురాలు గేడం ప్రియాంక, కార్యదర్శి ధరంసింగ్, సభ్యులు దీప్తి, మమత, శ్రీకాంత్, ప్రశాంత్‌రెడ్డి, ప్రకాశ్, విష్ణు, గణేశ్, సందీప్, సలీం, భగవాన్ పాల్గొన్నారు.