నార్నూర్ : సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ) పరిధిలోని ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సీఆర్టీల( కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్) కు సకాలంలో వేతనాలు( Salaries ) అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా వేతనాలు అందక పస్తులుంటున్నామని ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ పోషణ బారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు స్పందించి వేతనాలు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
ఐటీడీఏ పరిధిలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. అందులో 1,228 మంది సీఆర్టీలుగా పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 489, కుమ్రం భీం (అసిఫాబాద్)జిల్లాలో436, నిర్మల్ జిల్లాలో 165, మంచిర్యాల జిల్లాలో 138 మంది సీఆర్టీలు ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు కాగా రెండు నెలల వేతనం మాత్రమే మంజూరు చేశారని సీఆర్టీలు ఆరోపించారు. మరో ఐదు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని వాపోయారు. దీంతో సీఆర్టీలకు ఆర్థికంగా ఇబ్బంది తప్పడం లేదని పేర్కొన్నారు.
రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న తమకు కనీసం వేతనాలు విడుదల చేయడంలో జాప్యం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇచ్చే అరకొర వేతనమే సకాలంలో అందించడం లేదని ఆరోపించారు. నిత్యం ద్విచక్ర వాహనాలపై కొందరు, బస్సులు, ఆటోల్లో మరికొందరు, స్థానికంగా కొందరు ఉంటూ రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పని చేస్తున్నారు.
నెల నెల వేతనాలు రాక కనీసం ఇంటి అద్దె, కిరాణా సామాగ్రి, నిత్యవసర సరుకులు కొనుగోలు కోసం అప్పులు చేయాల్సి వస్తుందని సీఆర్టీలు వాపోయారు. తమకు అప్పులు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.