కోటపల్లి, జూన్ 22 : మహాలక్ష్మి పథకం ద్వారా పల్లె పల్లెకూ ఆర్టీసీ సేవలందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. ఆ యా రూట్లలో ఆర్టీసీ బస్సులతో పాటు ట్రిప్పులనూ తగ్గిస్తుండగా, ప్ర యాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ప్రధానంగా వివేక్ మంత్రిగా ఉన్నని యోజకవర్గంలోని కోటపల్లి మండలంలో సగానికి పైగా గ్రామాలు నేటి వరకూ బస్సులకు నోచుకోకపోగా, మరోవైపు బస్సులు నడుస్తున్న రూట్లలో సేవలు తగ్గిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
కోటపల్లి మండలం జనగామ గ్రామానికి ప్రతి రోజూ ఉదయం.. సాయంత్ర ఆర్టీసీ బస్సు నడిచేది. గతంలో ఈ రూట్లో రోడ్డు బాగున్నా.. ఏవేవో సాకులు చెప్పి ఆర్టీసీ బస్సును రద్దు చేశారు. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ ప్రముఖంగా కథనాలు ప్రచురించడంతో స్పందించిన ఆర్టీసీ.. బస్సు సేవలను పున:రుద్ధరించింది. గతంలో జనగామ రూట్లో బస్సులు నడిపించండి సారూ.. అంటూ చెన్నూర్ ఎమ్మెల్యే (ప్రస్తుత మంత్రి) వివేక్‌కు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులే స్వయంగా మొరపెట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఇదే మార్గంలో వారం నుంచి బస్సు సేవలు నిలిపి వేయడంతో పారుపల్లి, లిగన్నపేట, ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, నందరాంపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టీసీ అధికారులు ఈ రూట్లో ఆర్టీసీ సేవలు రద్దు చేసి ప్రైవేట్ ప్రయాణాన్ని పోత్సహిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. జనగామ రూట్లో బస్సు సేవలు లేకపోవడంతో సిర్సా, పారుపల్లికి చెందిన విద్యార్థులు కాలినడనక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వస్తున్నది. మంత్రి గడ్డం వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామ రూట్లో బస్సులు నడిపించాలని సిర్సా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు శుక్రవారం చెన్నూర్‌లో బస్టాండ్‌లోని ఆర్టీసీ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు.
చెన్నూర్ నుంచి సిరొంచ-కాళేశ్వరం రూట్లలోనూ అధికారులు సర్వీస్ ట్రిప్పులను తగ్గించారు. ఇక పల్లెవెలుగు బస్సులకు.. ఎక్స్‌ప్రెస్ బస్సులంటూ బోర్డులు పెట్టి నడిపిస్తూ ప్రయాణికులపై భారం మోపుతున్నారు. నిత్యం ఈ మార్గం రద్దీ ఉండేది కాగా.. ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపూ విమర్శలు వస్తున్నాయి. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బస్సు బోర్డులు పెట్టి నడిపిస్తుండడం వల్ల ఈ బస్సు కోటపల్లి మండలం కొల్లూరు బస్ స్టాప్‌లో మినహా ఎక్కడా ఆగడం లేదు. ఈ మార్గంలో చెన్నూర్ మండలంలోని చింతలపల్లి, అక్కెపల్లి, కోటపల్లి మండలంలోని పారుపల్లి బస్టాప్, ఎర్రాయిపేట, రాంపూర్, దేవులవాడ, బబ్బెరచెలుక, వెలమపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో బస్సులు నిలుపడం లేదు. ఫలితంగా ప్రజలు అధిక చార్జీలు చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇకనైనా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడంతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సులుగా మార్చిన పల్లెవెలుగు బస్సులను తిరిగి పల్లెవెలుగు స్థానంలోనే కొనసాగించాలని, లేదంటే రోడ్డెక్కి ఆందోళన చేపడుతామని పారుపల్లి, ఎర్రాయిపేట, రాంపూర్, దేవులవాడ, బబ్బెరచెలుక, లక్ష్మీపూర్, వెలమపల్లి తదితర గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 17న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జనగామ, నక్కలపల్లి రూట్లతో పాటు హైదరాబాద్(ఉదయం) కు ఆర్టీసీ బస్సులు నడిపించాలని చెన్నూర్ ఎమ్మెల్యే (ప్రస్తుత మంత్రి) ప్రభుత్వాన్ని వివేక్ కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆపై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్క జనగామ రూట్లో మాత్రమే బస్సు నడిపించారు. ఆరు నెలల పాటు బస్సును నడిపిన ఆర్టీసీ అధికారులు.. ప్రస్తుతం వివేక్ మంత్రి అయిన సమయంలో ఆ బస్సు సేవలను నిలిపివేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నక్కలపల్లి గ్రామానికి ఇప్పటి వరకు బస్సు సర్వీస్ నడవకపోగా పంగిడిసోమారం, రాజారం, కావర కొత్తపల్లి, బొప్పారం, నాగంపేట, కొండంపేట, ఎసన్వాయి, ఎడగట్ట, పిన్నారం గ్రామాలు ఆర్టీసీ సేవలకు ఆమాడ దూరంలో ఉన్నాయి
మంత్రి వివేక్ సారూ.. మా ఊళ్లకు బస్సు వస్తలేదు. మహాలక్ష్మి పథకం మాకు వర్తించదా. ఇప్పటి దాకా బస్సులు నడిపించిన అధికారులు మా ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత రద్దు చేయడం దారుణం. ఇకనైనా మా మంత్రి చొరవ చూపాలి.
– శనిగారం సత్యక్క, రొయ్యలపల్లి
చెన్నూర్ నుంచి సిరొంచ-కాళేశ్వరం రూట్లో నడిచే బస్సులు మా బస్టాప్ వద్ద ఆగుతలేవు. గతంలో ప్రతి పల్లెవెలుగు బస్సు మా స్టేజ్ వద్ద ఆగేది. ఇప్పుడు పాత పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టి మా బస్టాప్ వద్ద ఆపకుండా చేస్తున్నరు. ఎక్స్‌ప్రెస్ బస్సులను కొత్తవి ఏర్పాటు చేయకుండా పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టడం ఎంతవరకు సమంజసం. చెన్నూర్ నుంచి కొల్లూరు, సిరొంచ-కాళేశ్వరం కోసమే ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నట్లు ఉంది.
-ఆసంపల్లి లక్ష్మీ, లక్ష్మీపూర్
చెన్నూర్ నుంచి జనగామ రూట్లో నడిచే బస్సు ను ఆర్టీసీ అధికారులు మాటిమాటికీ రద్దు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫ్రీబస్సు పేరుకే కానీ.. బస్సులు మా రూట్లో సక్రమంగా నడిపింది లేదు. గతంలో నెలలకొద్దీ బస్సును నడిపించలేదు. మధ్యలో కొన్ని రోజులు నడిపించారు. ఇప్పుడు మళ్లీ రద్దు చేశారు. ఇప్పటికైనా మంత్రి వివేక్ సార్ మా ప్రాంత ప్రయాణికులు, మహిళల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బస్సు సర్వీస్‌ను నడిపించేలా కృషి చేయాలి.
– శనిగారం గౌరక్క (రొయ్యలపల్లి)