ఆదిలాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్కు ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీజీ ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్. భవానీ ప్రసాద్ ప్రకటనలో వెల్లడించారు. నేటి నుంచి అక్టోబర్ 1 వరకు సికింద్రాబాద్, హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు నడుస్తాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు హైదరాబాద్లో చదువుకోవడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు పండుగలకు తమ సొంత గ్రామాలకు రావడానికి రవాణా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు డిపోలు ఉండగా 414 బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవుల సందర్భంగా 50 మంది ఉన్నచోటికి బస్సులు పంపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందుకోసం సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించాలన్నారు. నేటి నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆదిలాబాద్ డిపో నుంచి 85, భైంసా డిపో నుంచి 20, నిర్మల్ డిపో నుంచి 123, ఉట్నూర్ డిపో నుంచి 5, ఆసిఫాబాద్ డిపో నుంచి 58, మంచిర్యాల డిపో నుంచి 123 స్పెషల్ బస్సులను నడుపుతున్నామన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రయాణికుల రద్దీ కారణంగా బస్సులు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కాకుండా సికింద్రాబాద్ జేపీఎస్ నుంచి బయలుదేరుతాయన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో రిజిర్వేషన్ సౌకర్యం వినియోగించుకోవాలని అధికారులు కోరారు.