కాగజ్‌నగర్, సెప్టెంబర్ 15: సిర్పూర్ నియోజకవర్గంలో యువతీ యువకులు పీజీలు చేసి వ్యవసాయ కూలీలుగా ఉన్నారని, వారి ఎదుగుదలకు తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో టాటా కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్పీ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్స్, ఉపాధి అవకాశాలు లేక యువత కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
గతంలో ఇక్కడి పాలకులు సట్టా మట్కా, అక్రమ దందాలకు అలవాటు చేసి యువత జీవితం నాశనం చేశారన్నారు. సకాలంలో ఉద్యోగాలు రాక అనేక మంది వ్యసనాలకు బానిస అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా టాటా కంపెనీ ప్రతినిధులతో సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు.
150 ఏళ్ల చరిత్ర కలిగిన కంపెనీలో వివిధ సెక్టార్లలో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. ఈ సెమినార్‌కు విశేష స్పందన వచ్చిందని, నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మిన్హాజ్, టాటా కంపెనీ సీనియర్ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.