బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వారంలోనే అమాంతం పెరగడంతో సామాన్యులతోపాటు మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతు న్నారు. రూ.700 నుంచి రూ.1000 పెరగడంతో క్వింటాలు బియ్యానికి రూ.6400 నుంచి రూ.7 వేలు పలుకుతున్నాయి. ప్రధానంగా.. భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో వరి పంట దెబ్బతినడం, రష్యా-ఉక్రేయిన్ దేశాల మధ్య యుద్ధం వల్ల గోధుమలు పండకపోవడం.
గోధుమలు మాత్రమే తినే ఉత్తర భారతదేశంలో బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం, ప్రపంచ దేశాల్లో ఆహార సంక్షోభం వంటి కారణాలతో ధాన్యానికి డిమాండ్ ఏర్పడింది. ఈ సీజన్లో గ్రేడ్-ఏకు రూ.2,203, కామన్ గ్రేడ్‌కు రూ.2,183 ప్రభుత్వం ఇస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.3,100 నుంచి రూ.3,200 వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వడ్లు ఆరబెట్టకుండానే.. పొలాల వద్దకే వచ్చి డబ్బులిచ్చి మరీ తీసుకెళ్తున్నారు.
– మంచిర్యాల, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బియ్యం ధరకు రెక్కలొచ్చాయి. వారం క్రితం వరకు తక్కువగా ఉన్న ధరలు.. ప్రస్తుతం క్వింటాల్‌పై రూ.700 నుంచి రూ.1000 వరకు పెరగడంతో సామాన్యులు హైరానా పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో పాతరకం హెచ్ఎంటీ, బీపీటీ రూ.6,400 క్వింటాల్ ఉంటే, ఫైన్, సూపర్ ఫైన్ వెరైటీలైన (జై శ్రీరామ్, సోనా మసూరీ, సాంబ మసూరీ, ఇతర సన్న రకాలు) క్వింటాల్‌కు రూ.6400 నుంచి రూ.7 వేల వరకు పలుకుతున్నాయి.
వీటిలో కొత్త రకమైతే క్వింటాల్‌పై రూ.500 వరకు తక్కువ ఉంది. వారం క్రితం ఇంటి పక్కోళ్లకు రూ.5400 క్వింటాల్ ఇచ్చినవ్ కదా, మా కాడికి వచ్చే సరికి రూ.1000 పెరిగిందా.. పోయిన నెల పాత రేట్‌కే ఇచ్చినవ్ కదా.. ఎంతో కొంత తగ్గించంటూ వ్యాపారులతో బేరమాడే పరిస్థితి వచ్చింది. ధాన్యానికి గింత డిమాండ్ ఎందుకు వచ్చింది. కొన్నేళ్లుగా దాదాపు రూ.100 నుంచి రూ.200 తేడాతో నడిచిన మార్కెట్ అమాంతం ఎందుకు పెరిగిందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశంలో ఈ ఏడాది ఊహించిన స్థాయిలో వర్షాలు పడలేదు. మన పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా చాలా రాష్ర్టాల్లో ఈసారి వరి దెబ్బతింది. 2022 ఏడాది వరి పంటలకు పెద్దగా కలిసి రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సంక్షోభ పరిస్థితి నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాలకు అతి పెద్ద గోధుమ ఎగుమతి దారుగా ఉన్న ఉక్రెయిన్‌లో ఈ ఏడాది పంటలు పండలేదు. ప్రపంచ దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడనుంది. ఫలితంగా వంట నూనెల ధరలతోపాటు ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోతున్నాయి. ఆ కారణంగానే గడిచిన వారం రోజుల్లో ధాన్యం ధర ఒక్కసారిగా 15 నుంచి 20 శాతం వరకు పెరిగిందని రైతులు, మార్కెట్ నిపుణులు, వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
పొరుగు రాష్ర్టాల్లో వరి పండ లేదు. గోధుమ పెద్దగా దొరక్కపోవడంతో గోధుమలు ఎక్కువగా తినే ఉత్తర భారతదేశ రాష్ర్టాల్లోనూ వరికి డిమాండ్ పెరిగింది. తెలంగాణలో పెద్దగా కరవు ప్రభావం కనిపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోస్తున్న క్రమంలో భారీ వర్షాలు పడ్డాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో వరి ధాన్యం ప్రతి ఏడాది లాగే ఈసారి చేతికొచ్చింది. దీంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి వ్యాపారులు తెలంగాణకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిజామాబాద్, కరీంనగర్ వ్యాపారులు వచ్చి వడ్లు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారంటే డిమాండ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత సీజన్లో క్వింటాల్‌కు ఏ గ్రేడ్ వడ్లకు రూ.2,060, కామన్ గ్రేడ్‌కు రూ.2,040 పలుకగా.. ఈ సీజన్లో ఏ గ్రేడ్‌కు రూ.2,203, కామన్ గ్రేడ్‌కు రూ.2,183 ప్రభుత్వం ఇస్తున్నది. సాధారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకం వడ్లను విక్రయిస్తుంటారు. గతంతో పోలిస్తే ధర పెరిగినా.. చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులపై విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి దొడ్డు రకమైన సన్నాలుగా చేసి విక్రయించే సదుపాయాలు ఉండడంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా దొడ్డు రకాలను ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే ఎక్కువ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.
ఇక సన్న రకాలపై క్వింటాల్‌కు రూ.3,100 నుంచి రూ.3,200 వరకు వెచ్చించి ప్రైవేటోళ్లు కొనుగోలు చేస్తున్నారు. పంట పొలాల్లో కోత కాగానే డబ్బులిచ్చి తీసుకెళ్తున్నారు. వడ్లు ఆరబెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్లే కొంటున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, మిల్లర్ల దగ్గరకు పోయే అవసరం లేకుండానే రైతులకు వ్యయప్రయాసలు తప్పాయి. బ్రోకర్లు, వ్యాపారులు రైతుల దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధాన్యం సాగు చేసిన రైతులకు మంచి రోజులు వచ్చాయి.