సిర్పూర్(టీ), జూలై 14 : మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, శరవేగంగా బాగు చేయాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ అస్లాం బిన్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం నాయకులు, కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలోని ఆర్అండ్బీ రోడ్డుతో పాటు నవేగాం గ్రామంలో ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు, బస్టాండ్ నుంచి కౌటలకు వెళ్లే ప్రధాన రహదారి, మహారాష్ట్రకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయన్నారు.
నవేగాం గ్రామం నుంచి వెంకట్రావ్‌పేట్ బైపాస్ రోడ్డు భారీ వాహనాలతో పాడైపోయినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడని తెలిపారు. గతంలో ఇదే రోడ్డును బాగు చేస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హామీ ఇచ్చారని, ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇకనైనా స్పందించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ చాంద్, నాయకులు రవి వర్మ, పనాస లక్ష్మణ్, ఎల్ములే నందాజీ, సునీల్, గౌతమ్, సోఫి, అరవింద్, నవీన్, అవినాశ్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.