ఇంద్రవెల్లి, మే 16 : ఆదిలాబాద్ ఏజెన్సీలో రహదారులు సక్రమంగా లేకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ నుంచి కెస్లాపూర్, పాటగూడ, తాటిగూడ, ఓల్‌మద్రి, పిట్టబొంగురం, దస్నాపూర్, దస్నాపూర్‌గూడ, మండలకేంద్రం వడగాం చౌక్ నుంచి అంజీ, మామిడిగూడ, జైత్రంతండా, జెండాగూడ, వడగాం, బండాపాటగూడ, ఆంధ్గూడ, మారుతిగూడ, హీరాపూర్, లాల్టేకిడి, గోపాల్పూర్, గోపాల్పూర్గూడ.. ఇంద్రవెల్లి మండల కేంద్రం చిచ్ధరిఖానాపూర్ రోడ్డు నుంచి సట్వాజీగూడ, మర్కాగూడ, రాంజీగూడ, బుర్సన్‌పటార్ గ్రామాలకు వెళ్లే రహదారులు పెద్ద పెద్ద గుంతలు పడి కంకర తేలి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ రోడ్ల మార్గంలో నిత్యం వందలాది వాహనాలు వెళ్తాయి. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు రాకపోడవడంతో వైద్య సేవలు సమయానికి అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు ఆధ్వానంగా మారిన రోడ్లపై దృష్టి సారించి, మరమ్మతులు చేసి ప్రమాదాల నుంచి కాపాడాలని ఆదివాసులు కోరుతున్నారు.