బజార్ హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ (Bazarhathnoor) మండలంలోని ఇచ్చోడా-సోనాల ప్రధాన రహదారిపై ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. చినుకుపడితే చాలు రోడ్డు బురదమయం అవుతున్నది. ఆ బురదలో బైక్పై వెళ్లాలన్నా ప్రజలు భయపడుతున్నారు. ఇచ్చోడా-సోనాల ప్రధాన రహదారిపై కోలారి గ్రామ సమీపంలో వంతెన నిర్మాణం ఏండ్ల కొద్ది సాగుతున్నది. ప్రత్యామ్నాయంగా వేసిన రోడ్డు చినుకు పడితే చాలు చిత్తడిగా మరుతుండటంతో ప్రయాణికులకు నరక ప్రయంగా మారింది.
బుధవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు పూర్తిగా బురదమయం కావడంతో నిత్యం వందల సంఖ్యలో ప్రయానించే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ద్విచక్ర వాహనదారులు బురదలో నుంచి తమ బైక్లను అతి కష్టం మీద బయటకు తీస్తున్నారు. మరికొందరు కాలినడకన ప్రయాణిస్తున్నారు. ఏడాది గడిచినా సదురు కాంట్రాక్టర్ వంతెన నిర్మాణం పూర్తిచేయడం లేదు. బ్రిడ్జి పరిధిలోని రోడ్డును మొరం వేసి అలాగే వదిలేయడంతో ఆ మార్గం గుండా వెళ్లాలంటేనే ప్రయానికులుకు జంకుతున్నారు. కొద్దిపాటి వర్షానికే ఇలా ఉంటే రాబోయే వానాకాలంలో ప్రయాణికుల పరిస్థితి ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు వంతెన నిర్మాణం దృష్టి సారించి సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు.