లక్షెట్టిపేట, మార్చి 15 : ఏఐ విద్యతో విప్లవాత్మక మార్పు వస్తుందని, విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏ.ఐ.) ద్వారా బోధన అందించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎఫ్.ఎల్.ఎన్.-ఏ.ఎక్స్.ఎల్. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీఈవో యాదయ్య, తహసీల్దార్ దిలీప్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఏక్ స్టెప్ ఫౌండేషన్ల సహకారంతో జిల్లాలో తొలి విడుతగా 7 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ల్యాబ్‌లు ఏర్పాటు చేసిందని, వచ్చే వారం మరిన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించడంతో పాటు స్వయంగా పాఠ్యాంశాలను బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాంకేతిక విద్యను సద్వినియోగించుకోవాలి : కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్దోత్రే
రెబ్బెన, మార్చి 15 : కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్) ద్వారా అందిస్తున్న సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామ పంచాయతీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడుతలో 4 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా విద్యార్థులను పాఠశాలకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహశీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో శంకరమ్మ, ఎంఈవో వెంకటేశ్వర్లు, పాఠశాల చైర్పర్సన్ సుజాత, సమగ్ర శిక్షా క్యాలిటీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, హైస్కూల్ హెచ్ఎం మహేశ్వర్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శంకరమ్మ ఉన్నారు.