దస్తురాబాద్, మే 8 : రైతులకు గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘గన్నీ సంచుల కొరత.. ఎగబడ్డ రైతులు’ అనే కథనం ప్రచురితం అయింది. ఈ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. గురువారం మండలంలోని రేవోజిపేట గ్రామంలో గల పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. తేమ శాతం వచ్చిన గన్నీ సంచులు ఇవ్వడం లేదని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో అధికారులు, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం వచ్చిన రైతులకు గన్నీ సంచులను అందించాలని ఆదేశించారు. తేమ శాతం వచ్చిన రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు.
లారీల కొరత, గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రెండు లారీలలో ధాన్యం బస్తాలను లోడ్ చేసి తక్షణమే రైసు మిల్లుకు పంపించాలన్నారు. అలాగే గన్నీ సంచులు గోదాం నుంచి తెప్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం పంపిన రిపోర్టులు, గన్నీ సంచుల రిపోర్టును అందించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. పీఏసీఏస్ సీఈవోకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కాగా.. అధికారులు రెండు లారీలలో 1800 బస్తాల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించారు. 2500 గన్నీ సంచులను గోదాం నుంచి తెప్పించి రైతులకు అందజేశారు. 2వేల ధాన్యం బస్తాలను హమాలీలు తూకం వేస్తున్నారు. ఆయన వెంట డీసీవో కల్లె పాపయ్య, డీఎం సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్ యాదవరావు, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ ఉన్నారు.