ఎదులాపురం/ఆసిఫాబాద్/హాజీపూర్, మార్చి 30;కేంద్రం యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా తీర్మానాలు జోరుగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీల నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ప్రజాప్రతినిధులు, రైతులు కలిసి తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగా బుధవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జడ్పీ అత్యవసర సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సభ్యులు పాల్గొని తీర్మానాలను చేశారు. కాగా.. వీటి ప్రతులను కేంద్రానికి పంపించ నున్నారు. ధాన్యం కొనేవరకు ఉద్యమిస్తామని, తెలంగాణపై మోదీ సర్కారు వివక్ష చూపుతున్నదని, రైతులకు అన్యాయం జరుగుతున్నదని సభ్యులు మండిపాడ్డారు.
కేంద్రం వడ్లు కొనాల్సిందే.. తెలంగాణ రైతులకు న్యాయం చేయాల్సిందే.. అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జడ్పీ పాలకవర్గాల సభ్యులు, ఎమ్మెల్యేలు తీర్మానించారు. బుధవారం ఆయా జిల్లా కేంద్రాల్లోని జడ్పీ కార్యాలయాల్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ‘తెలంగాణ ధాన్యం కొనబోమంటూ కేంద్రం కొర్రీలు పెడితే చూస్తూ ఊరుకోబోం.. రాష్ట్ర రైతాంగం తరఫున సీఎం కేసీఆర్ సారథ్యంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. ఇతర రాష్ర్టాల్లో పంటలు కొని.. తెలంగాణపై వివక్ష చూపితే కేంద్రానికి గుణపాఠం చెబుతాం.. అని స్పష్టం చేశారు. తీర్మానం కాపీని జడ్పీ చైర్మన్లకు అందజేశారు.
తెలంగాణ రైతులకు అన్యాయం
వడ్లు కొనకుండా, తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తున్నదని మంచిర్యాల జడ్పీ పాలకవర్గం అభిప్రాయపడింది. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ భారతీ హోళికేరి, జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్, ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి పాల్గొన్నారు. కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించి, ప్రతిని జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ వడ్లు కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖలు రాసినా, స్పందన లేదన్నారు. రాష్ట్ర సర్కారు రైతుల సంక్షేమానికి ఎంతో చేస్తుంటే, కేంద్రం కొర్రీలు పెడుతూ వివక్ష చూపుతోందన్నారు. రైతులకు అండగా ఉంటామని తెలిపారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇతర రాష్ర్టాల్లోలాగే తెలంగాణలో కూడా పంటలు కొనేదాకా విశ్రమించబోమని చెప్పారు. తెలంగాణ రైతు ఉద్యమం ఎలా ఉంటుందో రైతులకు తెలియజేస్తామని చెప్పారు.
–మంచిర్యాల జడ్పీ సమావేశంలో తీర్మానం
పోరాటాలు ఉధృతం చేస్తాం..
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ అత్యవసర సర్వసభ్య సమావేశం బుధవారం ఏర్పాటైంది. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో-ఆప్షన్ సభ్యులు ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. వీటితోపాటు మరో నాలుగు తీర్మానాలను కూడా ఆమోదించారు. ఎస్టీ, మైనార్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని, సీసీఐని పునరుద్ధరించాలని, గిరిజనులు నష్టపోకుండా నాన్ ఏజెన్సీని రీషెడ్యూల్ చేయాలని ప్రతిపాదించగా.. సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ జనార్దన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని 2017లోనే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు స్పందన రాలేదన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, మల్లెపూల నర్సయ్య, కుమ్ర సుధాకర్, అనిల్‌జాదవ్, నల్ల వనిత, అరుంధతి, అక్షిత ప వార్, పుష్పలత, ఎంపీపీలు, సభ్యులు పాల్గొన్నారు.
–ఆదిలాబాద్ జడ్పీ సమావేశంలో తీర్మానం
రాష్ట్రంపై వివక్ష సరికాదు..
కేంద్రం తెలంగాణపై వివక్ష చూపడం సరికాదని , రాష్ట్రంలో పండించిన వడ్లు కొనాల్సిందేనని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అధ్యక్షతన బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానాలో పంటలను ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేసినట్లే, తెలంగాణలోనూ వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వానకాలం, యాసంగి సీజన్లో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, తీర్మానించినట్లు చెప్పారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.
ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో వ్యవసాయరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, కానీ కేంద్రం కొర్రీలు పెడుతూ రైతాంగంపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ కేంద్రం చర్యలు తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేలా ఉన్నాయని, రైతుల పక్షాన పోరాడేందుకు టీఆర్ఎస్ ముందుంటుందన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు రైతులకు శాపంగా మారిందన్నారు. ఏడేళ్లలో బీజేపీ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, సీఈవో రత్నమాల, డీఏవో శ్రీనివాస్, జడ్పీటీసీలు సంతోష్, రామారావు, పుష్పలత, ద్రుపదాబాయి, అనూష, రాకబాయి, రేఖ, చంద్రశేఖర్, ఎంపీపీలు మోతీరాం, విమలాబాయి, జైనూర్ ఏఎంసీ చైర్మన్ భగవంత్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు ఉన్నారు.
–కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం తీర్మానం