‘కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలపై రైతాంగం భగ్గుమంది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతదో రైతుల మధ్యకొచ్చి చెప్పాలి. నోటికొచ్చినట్లు అవగాహన లేకుండా ఎట్లవడితే అట్ల మాట్లాడితే కుదరదు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఊరి పొలిమేరల్లోకి కూడా రానియ్యం.. వస్తే తరమి తరిమి కొడుతం. గతంలో కరంటియ్యక ఎవుసాన్ని ఆగం చేసింది చాలదా? మీ పెద్దన్న చంద్రబాబు రైతులపై కాల్పులు జరిపిస్తే.. నీవేమో కరెంటు మూడు గంటలే సాలంటవా?’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మూడో రోజైన బుధవారం కూడా రైతన్నలు మండిపడ్డారు. రైతువేదికల్లో నిర్వహించిన రైతుసభల్లో తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో తెలియజేశారు. ‘మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు.. మూడు పంటలకు కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలంటూ’ తీర్మానాలు చేశారు. కాగా.. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుసభకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గంలోని దస్తురాబాద్‌లో ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్, బోథ్ నియోజకవర్గం బజార్హత్నూర్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు.
– మంచిర్యాల, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గత చరిత్ర ఇంకా యాది మర్వలే..
గతంలో కరెంట్ కష్టాలన్ని చెప్తే ఓడిశెటియి కావు. కాంగ్రెసోళ్లు మళ్లావస్తే కష్టమే. రేవంత్ రెడ్డి నోటిని దగ్గర పెట్టుకుంటే మంచిది. రైతుల గురించి నీకేమన్నా తెలుసా.. సాగెట్ల చేస్తరో ఒక్కసారి చెప్పు.. మూడు గంటల కరెంటిచ్చి మా బతుకులను మళ్లా ఆగం చేద్దామని అనుకుంటున్నవా..? గతంలో నీ కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. రాత్రిళ్లు ఇంటినిడిసి పెట్టి పొలాల కాడ్నే పడుకునేటోళ్లం. ఇయ్యాల నువ్వేదో మాట్లాడుతున్నవ్. రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. మాయమాటలు చెప్పే మోసగాళ్ల మాటలు నమ్మితే మొదటికే మోసం వస్తది. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర మేమంతా చూసినం. ఇంకా అది యాది మర్వలే. ఇప్పుడిప్పుడే మాకు మంచి రోజులస్తున్నయ్. సీఎం కేసీఆర్ పుణ్యమాని పంటలు మంచిగ పండించుకుంటున్నం. ఆయన అన్ని సౌలతులు చేస్తున్నడు. ఇసోంటి సీఎం ను వదులుకుంటే మళ్లా చీకట్లే. రైతులమంతా ఆయనకే సపోర్టిత్తం.
– తాండ్ర పోతన్న, రైతు, బజార్హత్నూర్
మంచిర్యాల, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎట్లా చాలుతదో వివరించాలి. లేనిపక్షంలో యావత్ తెలంగాణ రైతులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రైతులు ముక్తకంఠంతో నినదించారు. రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపించినా తరమికొడుతామని హెచ్చరించారు. రైతులను చీకట్లోకి నెట్టాలని చూస్తున్న పార్టీని అంధకారంలోకి నెట్టేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడో రోజైన గురువా రం ఉమ్మడి జిల్లాలో రైతుసభలను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి పాలనలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదని.. రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ కోసం కాపలాకాసిన ఆ చీకటి రోజులను గుర్తుకు చేసుకునే ధైర్యం కూడా తాము చేయలేమని రైతులు వాపోయారు. ఈ దుర్మార్గపు ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీని ఊర్లలోకి రానివ్వకుండా తరిమికొట్టాలని.. మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు.. మూడు పంటలకు కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలంటూ తీర్మానాలు చేశారు.
వేలాదిగా తరలివచ్చిన రైతులు.. ప్రముఖుల హాజరు..
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు సభకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులు పచ్చబడుతుంటే చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతున్నదన్నారు. రైతులపై కాల్పులు జరిపిన చంద్రబాబుతో కలిసి తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహి రేవంత్‌రెడ్డి.. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం రైతులు చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ సీతారాంపల్లి, దండేపల్లి, లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ రైతువేదికల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి నియోజవకర్గంలోని నెన్నెల మండలంలో గల చిత్తాపూర్, గురిజాల మండల రైతువేదికల్లో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఖానాపూర్ నియోజకవర్గం దస్తురాబాద్‌లో ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్, బోథ్ నియోజకవర్గం బజార్హత్నూర్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఆసిఫాబాద్ నియోజకవర్గం లింగాపూర్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు రైతు సభల్లో పాల్గొన్నారు. రైతులు వేలాదిగా తరలివచ్చి సభల్లో పాల్గొన్నారు.