ఖానాపూర్ : గోసంగీలకు (Gosangis) రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిచరణ్ (President Sai Charan) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2011లో జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో గోసంగి కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం గోసంగి జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కూచంపల్లి త్రివేంధర్, అధికార ప్రతినిధిగా కత్తెరపాక శ్రీధర్, ప్రచార కార్యదర్శిగా దాసరి నాగరాజు, సంయుక్త కార్యదర్శి రాకేష్, మునుగురి గణేష్, రాజేశ్వర్, తిరుపతి, గంగరాజంలను ఎన్నుకున్నారు.
గోసంగి కుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి హక్కులు సాధించుకోవాలని జిల్లా నూతన అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ కోరారు. గోసంగి కుల గణన ప్రకారం లెక్కలు చేయించి ప్రభుత్వానికి నివేదించడంతో పాటు రిజర్వేషన్లు సాధించుకునే దిశగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు జిల్లాలో గోసంగి కుల సభ్యులు వెనుకబడి ఉన్నారని, రిజర్వేషన్లు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముందుకు నడవాలని సూచించారు.
రానున్న రోజుల్లో మండల, జిల్లా స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేసి గోసంగి కుల సంఘ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేష్, ఉపాధ్యక్షుడు రవీందర్, కోశాధికారి రమేష్, అధికార ప్రతినిధి తిరుపతి, ఖానాపూర్, కడెం, దాస్తురాబాద్ మండలాల కార్యవర్గ సభ్యులు ఉన్నారు.