భీమారం, నవంబర్ 24 : ఎంపీడీవో ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టు ఇచ్చారని, ఆయన నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని ఆ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా భీమారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు. బీసీలకు 42 రిజర్వేషన్లు వచ్చే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు బోర్లకుంట వెంకటేశ్ నేత మద్దతు తెలిపారు.
ఎంపీడీవోను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో పొంతనలేని సమాధానాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమారంలో వార్డు స్థానాలు కూడా ఇష్టం వచ్చినట్లు కేటాయించారని, వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ శ్వేత అక్కడికి చేరుకొని ఎంపీడీవో మధుసూదన్‌తో పాటు ఆందోళన కారులతో మాట్లాడారు. కలెక్టర్ దగ్గరకు వెళ్తే న్యాయం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ సీసీతో ఎస్ఐ మాట్లాడించారు. ఆపై కలెక్టరేట్‌కు వెళ్లారు. కార్యక్రమంలో నాయకులు వేముల శ్రీకాంత్ గౌడ్, ఆవుల సురేశ్‌యాదవ్, లక్ష్మణ్ యాదవ్, కొమ్ము కుమార్ యాదవ్, పానుగంటి లచ్చన్న, సుంకరి భూమేశ్, ఉష్కమల్ల పున్నం చందు, ఉష్కమల్ల శ్రీనివాస్, ఉష్కమల్ల సదాశివ, తాళ్లవేణు, అరకట్ల తిరుపతి పాల్గొన్నారు.