మంచిర్యాలటౌన్, జూలై 24 : మంచిర్యాల మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి నిధులు వెచ్చించి ప్రధాన రహదారిపై నాలుగు ప్రాంతాల్లో రూ.నాలుగు కోట్లతో నిర్మించిన జంక్షన్లను కూల్చివేయడం దారుణమని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందించారు.
వారు మాట్లాడుతూ 20 నెలల క్రితమే నిర్మించిన జంక్షన్లను కూల్చివేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన మున్సిపల్ సమావేశంలో జంక్షన్ల వెడల్పు మాత్రమే తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఎమ్మెల్యే పీఎస్సార్ చెప్పారని, కానీ అందుకు విరుద్ధంగా జంక్షన్లను కూల్చివేశారని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నిర్మించిన నాలుగు జంక్షన్లలో ఐబీలో అంబేద్కర్ విగ్రహంతో పాటు పార్లమెంట్ నమూనాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, కానీ కొంత ఆలస్యమైందన్నారు.
మిగిలిన వాటిలో వెంకటేశ్వరటాకీసు చౌరస్తాలో వివిధ కులవృత్తుల వారికి సంబంధించిన నమూనా విగ్రహాలు, బెల్లంపల్లి చౌరస్తాలో త్రివిధ దళాలకు సంబంధించిన నమూనా విగ్రహాలు, లక్ష్మీటాకీసు చౌరస్తాలో ప్రకృతికి సంబంధించిన వివిధ ఆకృతుల నమూనాలను ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఎక్కడా ప్రమాదాలు జరుగకున్నా.. జరుగుతున్నాయంటూ చెప్పి మొత్తానికే కూలుస్తున్నారని మండిపడ్డారు. జంక్షన్ల కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదని అన్నారు .కోట్లాది రూపాయలను వృథాచేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆ నిధులను వారి నుంచే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇసుక పక్కదారి..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకోసం ఇస్తున్న ఇసుక మంచిర్యాలలో పక్కదారి పడుతున్నదని బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయ ఏవోకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇచ్చే ఇసుకలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, అధికారపార్టీకి చెందిన నాయకులు వారి ట్రాక్టర్లతో తరలించి అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లకు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని కోరారు. అలా ఇసుకను తీసుకువచ్చిన ట్రాక్టర్ ఇందిరమ్మ ఇంటి దగ్గర కాకుండా ఇతర ప్రాంతాల్లో పోస్తే సదరు ట్రాక్టర్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, వంగ తిరుపతి, నరేశ్, ఎర్రంతిరుపతి, తాజొద్దీన్, కాటం రాజు, ప్రదీప్, పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.