కరెంట్ చార్జీలను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ చెక్ పెట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడవకుండానే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.18,500 కోట్ల భారాన్ని వేయాలని చూసిందన్నారు. సామాన్యులపై ఈ భారం పడకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రిసిటీ రెగ్యులటరీ కమిషన్(ఈఆర్సీ) ఎదుట వాదనలు వినిపించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి 100 శాతం పోరాడింది. బీఆర్ఎస్ వాదనలతో ఏకీభవించిన ఈఆర్సీ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది.
ఈ విజయంపై రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యం లో సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుచ్చారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంబురాల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
బోథ్ నియోజకవర్గ కేంద్రంలో సంబురాలు జరిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బాంబులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. నిర్మల్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
– మంచిర్యాల, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి)