కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గృహాలు, ఓపెన్ ప్లాట్లు, వివాహాలు, ఇతర ఫర్మ్ రిజిస్ట్రేషన్ల మీద రావాల్సి ఆదాయం దాదాపుగా 15 శాతం తగ్గింది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.174 కోట్ల ఆదాయం రాగా, ఇదే కాల పరిమితిలో గతేడాది 2023లో రూ.205 కోట్లు, 2022లో రూ.213 కోట్ల ఆదాయం సమకూరింది. గత రెండు, మూడేండ్లలో ఒక వెలుగు వెలిగిన రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఢీలా పడడంతో రియల్టర్లు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి నెలకున్నది. కొన్నాళ్లుగా జోరు మీదున్న స్థిరాస్తి రంగం నానాటికీ అథోగతికి చేరుకుంటున్నది. సాధారణ స్థితికి భిన్నంగా ఏడాదిన్నరగా స్థిరాస్తి వ్యాపారం అంతగా సాగడం లేదు.
అమ్మేవారు తప్ప కొనేవారు ఎవరూ లేకపోవడంతో బిజినెస్ మందగించింది. వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల(ప్లాట్ల) అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాలు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. భూముల ధరలు విపరీతంగా ఉండడం, కొన్న తర్వాత మళ్లీ పెరిగే అవకాశం కనిపించకపోవడం వంటి కారణాలతో రియల్ రంగం అంతకంతకు మందగిస్తోందని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్న మాట. కాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు తగ్గడంతో సర్కార్ ఆదాయానికి భారీగా కోత పడింది. హైడ్రా ద్వారా భూముల కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో భూమి కొనుగోళ్లకు బ్రేక్ పడింది.
– మంచిర్యాల, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి)