ఆదిలాబాద్ : వానకాలంలో ( Monsoon cultivation ) సాగు చేసే పంటలకు రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆదిలాబాద్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు (Agricultural scientists) సూచించారు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ కె రాజశేఖర్, డాక్టర్ జి శివ చరణ్ మాట్లాడుతూ వ్యవసాయంలో ప్రస్తుత పరిస్థితులలో విత్తన మొలక శాతాన్ని గమనించడం, విత్తన రసీదును భద్రపరుచుకోవాలని సూచించారు.
ఎరువుల సమత స్థితిని పాటించడం, విచక్షణారహితంగా పురుగు మందులు వాడకపోవడం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం, సమీకృత వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడి, చెట్లు నాటడం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి లావణ్య, మండల వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేశ్వర్, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.