సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు వరం
ఆయనకు రుణపడి ఉంటాం
కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తాం
‘నమస్తే’తో పలువురు యువకులు
ఆదిలాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని బుధవారం అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగ యువతలో ఆనందం వెల్లివిరిస్తున్నది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం తమకు వరమని, ఇంతకు ముందెప్పుడూ ఇంతపెద్ద నోటిఫికేషన్ రాలేదని, దేశ చరిత్రలోనే ఇది రికార్డు రిక్రూట్మెంట్ అని, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి తీరుతామని బుధవారం పలువురు యువకులు ‘నమస్తే’తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని, ఇప్పటికే ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారని, ఇక మన నిధులు మనకే వినియోగిస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపారని వారు కొనియాడారు. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నందుకు సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇంత మంచి అవకాశం కల్పించిన సీఎంకు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
నియామకాలతో పరిపూర్ణం..
నిర్మల్, మార్చి 9(నమస్తే తెలంగాణ): కొత్త రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది. ఈ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లడం వల్లే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారు. నీళ్లు, నిధులను సాధించిన ముఖ్యమంత్రి… ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టి, పరిపూర్ణం చేశారు. ఇప్పటి వరకు నిరుద్యోగుల్లో కొంత నిరాశ ఉండే. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల భర్తీ పై బుధవారం ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో అది కూడా తొలిగిపోయింది. యువతకు, నిరుద్యోగులకు కొండంత భరోసానిచ్చినైట్లెంది.
–కటికె శివాజీ, ఉద్యమకారుడు, నిర్మల్
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
నిర్మల్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత ప్రకటన చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టింది. కరోనా లాంటి కష్ట కాలంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు సీఎం తీపి కబురు చెప్పారు. ఈ ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే కాకుండా ప్రతీ ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. నిధులు, నీళ్లు, నియామకాలతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్ఎస్ సర్కారు చరిత్రలో నిలిచిపోతుంది.
–వీ మహేశ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్
కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తా..
నిర్మల్, మార్చి 9(నమస్తే తెలంగాణ): ఇన్ని రోజు లు ఉద్యోగం వస్తుందో లేదో అన్న బెంగ ఉండే.. ఒకేసారి వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్య మంత్రి ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కలుగుతున్నది. ఉద్యోగాల ప్రకటనతో ఎలాగైనా సరే మరింత కష్టపడి చదివి ఉద్యోగం సాధించాల న్న పట్టుదల పెరిగింది. సీఎం సారుకు థాంక్స్..
–డీ సాయి తన్మయి, డిగ్రీ మూడో సంవత్సర విద్యార్థిని
ఏదైనా కేసీఆర్‌కే సాధ్యం..
దస్తురాబాద్,మార్చి 9: రాష్ట్రమంతా పండుగలా మారింది. ఇక నిరుద్యోగుల విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇయ్యాల నిజంగా పండుగ రోజు. సీఎం కేసీఆర్‌కే ఏదైనా సాధ్యమనే విషయం దీంతో తేలిపోయింది. ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ప్రకటించడమంటే మాటలు కాదు. ఉదయం పది గంటల నుంచి టీవీ కాడ్నే కూసున్న. ఆలస్యమైనా సీఎం కేసీఆర్ అనుకుంటే మంచి జరుగుతదని నమ్మకం ఉండే. ఇప్పుడు నా నమ్మకం నిజమైంది. ఇది మంచి అవకాశం అనుకుంటున్న. కచ్చితంగా పట్టుదలతో ప్రిపేరవుతా. ఉద్యోగం సాధించడమనేది నా గోల్. దానికి అనుగుణంగా ప్రణాళికతో చదవాలని అనుకుంటున్న. – మామిడి వేణు, నిరుద్యోగి, బుట్టాపూర్
నిరుద్యోగులకు మేలు
ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులకు ఎంతో మేలు కలుగుతుంది. చాలా రోజులుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. తెలంగాణ సకల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అందరికీ తెలుసు. ఎన్నో పథకాలు, అద్భుతాలతో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన్రు. రాష్ర్టాన్ని సాధించి ఒకసారి, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల ప్రకటనతో ఆయన మరోసారి చరిత్ర సృష్టించారు. నోటిఫికేషన్లు రాగానే ఐప్లె చేసుకుంట.
–బోనగిరి రవి కుమార్, నిరుద్యోగి, కుంటాల
13 ఏండ్ల కల నెరవేరింది
నేను 13 ఏండ్ల నుంచి ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. నా భర్త ప్రైవేటు ఉద్యోగి. ఈ జీతాలతో పిల్లల చదువులు ఎలా అని దిగులు ఉండేది. ఎన్నో వర్గాలకు సంక్షేమ పథకాలు, మరికొన్ని కొలువులకు జీతాలు పెంచుతున్న సీఎం కేసీఆర్ సార్ మమ్మల్ని కూడా రెగ్యులరైజేషన్ చేస్తారనే నమ్మకం ఎప్పుడూ ఉంది. మా యూనియన్ల ద్వారా కూడా చాలా సార్లు విన్నవించినం. ఇపుడు సీఎం కేసీఆర్ సార్ ఆ శుభవార్త చెప్పనే చెప్పిన్రు. ఉద్యోగ నోటిఫికేషన్లు, రెగ్యులరైజేషన్ వరాలతో నేను, నా తోటి లెక్చరర్లు ఎంతో సంతోషించాం. సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది.
–బీ సుప్రియ,లెక్చరర్, ప్రభుత్వ బాలికల కళాశాల, ఆదిలాబాద్
ఉద్యోగం సాధించి తీరుతా..
సీఎం కేసీఆర్ ప్రకటన మాలో ఆత్మవిశ్వాసం నింపింది. గతంలో నేను పోలీస్ కానిస్టే బుల్ ఉద్యోగం కోసం ప్రయ త్నించి విఫలమయ్యా. ఈ సారి ఒక లక్ష్యంతో చదివి, పట్టు సాధిస్తా. రాష్ట్రంలో ఈ రోజు నాకు పండుగ తీరే అనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని పొద్దటి నుంచి టీవీల కాడ్నే ఉన్నరు. నిన్ననే అనుకున్నం నోటిఫికే షన్లు ఇస్తరని. సీఎం సారు చెప్పంగనే సంబురమైంది. నా దోస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నరు. నోటిఫికేషన్లు రాగానే దరఖాస్తు చేసుకుంట.
–ఎస్. సాయికుమార్, బృందావన్ కాలనీ, ఆదిలాబాద్
స్థానికులకే ఇవ్వడం అభినందనీయం..
రెండేళ్ల కిందట నా ఎంటెక్ పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా కల. ప్రైవే టు ఉద్యోగాలు వచ్చినా చేయలే. రెండేళ్లుగా ప్రిపేరవుతున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన నాలో ఉత్సాహాన్ని నింపింది. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో జాబ్ సాధించడానికి మంచి అవకాశం దక్కింది. గతంలో ఇతర ప్రాంతాల వారి నుంచి పోటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. ఏడేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నరు. ఇన్ని ఉద్యోగాలు ప్రకటించడం సాహసోపేత నిర్ణయం. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించిన సీఎం ఎవరూ లేరు. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పాలిట దైవంగా నిలిచారు. నేను గ్రూప్-1 రాయాలనుకుంటున్న. – దీపక్ గాడ్గే, ఎంటెక్, ముక్రా(కే), ఇచ్చోడ మండలం
నమ్మకం నిజమైంది..
నిర్మల్, మార్చి 9(నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. 2006 నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పని చేస్తున్నా. 16 ఏళ్లుగా జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నప్పటికీ ఏదో ఒక వెలితిగా ఉండేది. ఎప్పటికైనా మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. ముందునుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తలుచుకుంటే చేస్తారనే భరోసా ఉండే. ఇప్పుడు మా నమ్మకం నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం.
–జీ శ్రీనివాస్ రావ్, కాంట్రాక్టు లెక్చరర్, నిర్మల్
దేశ చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్
నిర్మల్, మార్చి 9(నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశం.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలకు ఇంత పెద్ద నోటిఫికేషన్ రాలేదు. ఇది దేశ చరిత్రలోనే ఒక భారీ రిక్రూట్మెంట్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది అతిపెద్ద ఉద్యోగాల జాతర. దేశంలోనే అధిక వేతనాలను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం రావడాన్ని నిరుద్యోగులు, యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉద్యోగాల అర్హతకు సంబంధించి వయస్సును కూడా సడలించడంతో చాలా మందికి మేలు జరిగింది. ప్రైవేట్ రంగంతో పాటు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారు కూడా ఉద్యోగ భద్రత దృష్ట్యా ఈ ఉద్యోగాల కోసం పోటీపడే అవకాశం ఉంది.
–ధాత్రిక రమేశ్, ఎస్టీవో, ఉమ్మడి రాష్ట్ర గ్రూప్ 2 విజేత