‘తెలంగాణ ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే ‘కంటి వెలుగు’ కార్యక్రమం. ఇదీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐ స్క్రీనింగ్. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 950 మంది వైద్యులను సర్కారు నియమించింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 255 మంది డాక్టర్లు వచ్చారు. ప్రస్తుతం వైద్యుడు లేని పీహెచ్సీ లేదు.’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అధికారులకు ‘కంటి వెలుగు’పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ పథకాలతో దేశంలో పరివర్తన మొదలైందన్నారు. ఈ కార్యక్రమాల్లో విప్ సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, సక్కు, కోనప్ప, జడ్పీ చైర్ పర్సన్స్ కోవ లక్ష్మి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల ఏసీసీ, జనవరి 8 : ‘తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కంటి సమస్య ఉండొద్దు. కండ్లు సరిగ్గా కనిపిం చక ఇబ్బందులు పడేవారికి ఉచితంగా కండ్లద్దాలు ఇయ్యాలే. కండ్లు కనిపిస్తలేవు అని ఎవరూ బాధపడొద్దు’ అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్య క్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివా రం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ భారతీ హోళికేరి అధ్యక్షతన జరిగిన కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యా ప్తంగా వంద రోజుల్లో 1.50 కోట్ల మందిని పరీక్షించే రెండో దఫా ‘కంటి వెలుగు’ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కనుందన్నారు. కండ్లు సరిగ్గా కనిపించక బాధపడే వృద్ధులు సీఎం కేసీఆర్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. మహారాష్ట్ర, బిహార్, రాజస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి వివిధ పనులు చేసుకునేవారికి కూడా కంటి పరీక్షలు నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జనవరి 12లోపు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కింది స్థాయి ప్రజాప్రతినిధులందరికీ కార్యక్రమం గురించి చెప్పాలన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటికే పెద్దాసుపత్రి ఉందని, చెన్నూరు, బెల్లంపల్లిలో 100 పడకల దవాఖానలు కూడా వచ్చాయన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 950 మంది వైద్యులకు కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వగా.. ఇందులో పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు 255 మంది డాక్టర్లను ఇచ్చారన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన కార్యక్రమం కంటి వెలుగు అని, సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. తొలి విడుతలో సుమారు ఎనిమిది నెలలపాటు తెలంగాణ వ్యాప్తంగా 1.54 కోట్ల మందిని స్క్రీనింగ్ చేసి.. సుమారు 54 లక్షల మందికి కండ్లద్దాలు ఇచ్చామన్నారు. అప్పట్లోనే ప్రపంచంలో అతి పెద్ద ఐ-స్క్రీనింగ్ కార్యక్రమంగా నిలిచిందన్నారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని రెండో విడుతలో 100 రోజుల్లోనే 1.50 కోట్ల మందికి పరీక్షలు చేసి, దాదాపు 50 లక్షల మందికి కండ్లద్దాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇయ్యాల రైతుబంధు ఎనిమిది రాష్ర్టాలకు ఆదర్శమైందని, అలాగే మనల్ని చూసి ఎనిమిది రాష్ర్టాలు రైతుబంధు, 12 రాష్ర్టాలు మిషన్ భగీరథ, ఏడు రాష్ర్టాలు మిషన్ కాకతీయ చేపట్టాయన్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటాయన్నారు. కంటి వెలుగులో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలతో మంచిర్యాల పోటీ పడేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు టార్గెట్ తొమ్మిది లక్షలుగా నిర్ణయించుకున్నాం. ఇందులో 56 శాతం గ్రామీణ, 44 శాతం పట్టణ ప్రాంతాలుగా ఉన్నాయి. 311 పంచాయతీలు, 174 మున్సిపల్ వార్డుల్లో పరీక్షలు చేయడానికి 40 బృందాలను కేటాయించాం. ఇవి కాకుండా రెండు బఫర్ బృందాలు ఉంటాయి. మొత్తంగా 484 ప్రాంతాల్లో 100 రోజుల పని దినాల్లో (సోమవారం నుంచి శుక్రవారం వరకు) ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో టీమ్ రోజూ గ్రామీణ ప్రాంతాల్లో 300, పట్టణ ప్రాంతాల్లో 400 పైచిలుకు మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కంటి పరీక్షల్లో రెండు రకాల (రీడింగ్ గ్లాస్, ప్రిస్పిక్షన్) గ్లాసులు ఉంటాయి. రీడింగ్ గ్లాసులు అవసరమున్న వారికి పరీక్షల అనంతరం వారికి వచ్చిన స్థాయిని బట్టి అక్కడే రీడింగ్ గ్లాసులను అందించడం జరుగుతుంది. వీటికి సంబంధింన 34,520 గ్లాసులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. ప్రిస్పిక్షన్ గ్లాసులు అవసరమున్న వారికి పరీక్షల అనంతరం ఎంపిక చేసిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాం.
పేదలు కంటి పరీక్షలు చేసుకోవాలంటే ప్రైవేట్ దవాఖానలో కనీసం రూ.2వేలకు పైగా ఖర్చు అవుతుంది. మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతలో 4 లక్షల పైచిలుకు మంది పరీక్షలు నిర్వహించుకోగా 1.20 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశాం. గ్రామాల్లోనే కాకుండా తండాల్లోనూ కార్యక్రమాన్ని నిర్వహించి 100 శాతం విజయవంతం చేసుకుంటాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కంటి వెలుగు కార్యక్రమం అమలవుతుంది. ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ప్రజలకు మరింత చేరువకావాలి. మనకు కేటాయించిన అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ రాహుల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.