మంచిర్యాల, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీ సర్పంచి పదవిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు గురి పెట్టారు. బరిలో నిలిచి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతుండగా, ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన రియల్టర్ తన భార్యను బరిలో నిలిపారు. ఏడాదిగా ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న సదరు వ్యాపారి.. గ్రామంలో కుల సంఘాలన్నింటినీ సంప్రదించి, వారి కులదైవాలకు సంబంధించిన దేవాలయాల నిర్మాణాలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే రెండు, మూడు కుల సంఘాలకు దేవాలయాల నిర్మాణానికి సహకరించిన ఆయన, మిగిలిన కుల సంఘాలకు భారీగా డబ్బులు ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇవేగాకుండా ఓటర్లకు రూ.వెయ్యి నుంచి రూ.1500 ఇచ్చేందుకు సై అంటున్నట్లు తెలిసింది. ఆయన ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు, పెట్టనున్న ఖర్చు మొత్తం రూ.2 కోట్లు దాటి పోయే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇదే మండలంలో మరో గ్రామం నుంచి ఓ రియల్టర్ పోటీ చేస్తున్నారు. జనరల్ స్థానం నుంచి బరిలో ఉన్న ఆయన సైతం ఎన్నికల్లో అరకోటి ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇక జైపూర్ మండలంలో మరో రియల్టర్లు (మాజీ ప్రజాప్రతినిధి) మరోసారి సర్పంచ్‌గా నిలబడ్డారు.
గతంలో మాజీ సర్పంచ్‌గా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన ఈయన కూడా ఈ సారి గ్రామంలో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. ఎంత ఖర్చైనా తగ్గేదేలే అంటున్న ఆయన దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ఖర్చు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ కొస మెరపు ఏమిటంటే ఇప్పటికే పోటీ చేస్తున్న గ్రామాల్లో కొన్ని నాన్-లే అవుట్ వెంచర్లు వేసి, పెద్ద మొత్తంలో భూములు కొనిపెట్టుకున్న ఈ రియల్టర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే తమ వ్యాపారానికి అడ్డు ఉండదని భావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే ఎంత ఖర్చైనా పెట్టుకునేందుకు సై అంటూ ముందుకు వస్తున్నట్లు తెలిసింది.
బరిలో సీఎంఆర్ పెట్టని మిల్లర్లు
సీఎంఆర్(కస్టమ్ మిల్ల్డ్ రైస్) పెట్టకుండా ప్రభుత్వానికి కోట్లాది రూపాయాలు ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లు కొందరు సర్పంచ్ ఎన్నికల బరిలో తమ కుటుంబ సభ్యులను నిలబెట్టారు. భీమారం మండలంలో ఓ గ్రామానికి చెందిన రైస్ మిల్లర్ దాదాపు రూ.25 కోట్ల సీఎంఆర్ కట్టకుండా డీ-ఫాల్ట్ అయ్యాడు. ఈ మేరకు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ మేరకు సదరు రైస్ మిల్లర్‌పై ప్రత్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. జైపూర్ మండలంలోని ఓ గ్రామం నుంచి రూ.15 కోట్లు సీఎంఆర్ డీ-ఫాల్డర్గా ఉన్న మరో మిల్లర్ సైతం సర్పంచ్ బరిలో తన కుటుంబ సభ్యులను నిలబెట్టారు.
ఈ రెండు గ్రామాల్లో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ఖర్చు పెట్టేందకు ఈ మిల్లర్లు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. సర్కారుకు పెట్టాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని పక్క దారి పట్టించి, కోట్ల రూపాయాలు సంపాదించి.. కేసుల్లో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నెన్నెల మండలంలోని ఓ గ్రామంలోనూ సీఎంఆర్ డీఫాల్డర్గా ఉన్న మిల్లర్ కుటుంబ సభ్యులు పోటీలో ఉన్నారు. ఈ గ్రామంలో రూ.50 లక్షలు ఖర్చు పెట్టేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర వ్యాపారాల్లో ఉండి సర్పంచ్ కావాలనుకుంటున్న కొందరు నాయకులు సైతం కొన్ని గ్రామాల్లో రూ.50 లక్షలు పంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక వివిధ పోలీస్ కేసుల్లో ఉండి.. అరస్టై జైలుకు కూడా వెళ్లి వచ్చిన నాయకులు సైతం సర్పంచ్ బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. లక్షెట్టిపేట మండలంలోని ఓ గ్రామంలో అధికార పార్టీ నుంచి క్రిమినల్ కేసులో ఉండి, జైలుకు వెళ్లి వచ్చిన ఓ నాయకుడి తన భార్యను సర్పంచ్ బరిలో నిలిపారు. ఇలా రియల్టర్లు, డీఫాల్ట్ మిలర్లు, పలుచోట్ల వ్యాపారులు పోటీ చేస్తుండడంతో కొన్ని గ్రామాల్లో ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి.
రూ.2.50 లక్షలు దాటొద్దు..
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా రూ.2.50 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.50 వేలలోపే ఖర్చు చేయాలి. ఇక ఐదువేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.30 వేలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కానీ, ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. రియల్లర్టు, మిల్లర్లతో పాటు జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉండి రియల్ ఎస్టేట్ వెంచర్లు, వ్యాపారం జోరుగా సాగే గ్రామాల్లో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఇలా కొన్ని గ్రామాల్లోనూ ఖర్చు లక్షలాది రూపాయాల్లో ఉండనున్నది. దీంతో ఆయా గ్రామాలపై ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఎన్నికల్లో గెలవడం కోసం ఇలా రూ.కోట్లు, రూ.లక్షల్లో ఖర్చు పెడుతున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సూచిస్తున్నారు.