కాసిపేట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారు సోమగూడెం ( Somagudem ) లోని సర్వే నెంబర్ 3 భూముల్లో నిర్మించిన 13 ఇళ్లను కూల్చేందుకు ( Demolition ) సోమవారం కోర్టు సిబ్బంది, పోలీసులు రావడంతో ఇంటి యాజమానులు, స్థానికులు అడ్డుకున్నారు. జేసీబీ ముందు బైఠాయించారు.
ఊరు మందమర్రికి చెందిన రాం కిష్టయ్య అనే వ్యక్తి కుటుంబీకులు సర్వే నెంబర్ 3 భూముల్లోని 02.75 ఎకరాలు తమ భూమి అని కోర్టును ఆశ్రయించడంతో రాం కిష్టయ్యకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈ భూమిలో పలువురు నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఈ భూముల్లో నిర్మించిన ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాల జారీ చేసి 13 మందికి నోటీసులు అందజేశారు.
ఇళ్ల నిర్మాణాలు కూల్చేందుకు సోమవారం కోర్టు సిబ్బందితో పాటు పోలీసులు రావడంతో ఇంటి యాజమానులతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. కాగితాలు చూపాలని, తప్పుడు పత్రాలతో తమకు అన్యాయం చేస్తున్నారని మండి పడ్డారు. తమకు సమయం కావాలని, ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో కూల్చనివ్వమని పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లిన వారితో స్థానిక నాయకులు మాట్లాడారు. తమ భూమి తమకు కావాలని కోర్టుకు వెళ్లిన రాం కిష్టయ్య, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఇళ్ల కూల్చివేతలను అడ్డుకోవడంతో అధికారులు వెను దిరిగి వెళ్లిపోయారు.