మంచిర్యాల అర్బన్, జనవరి 28 : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉప సంచాలకుడు రవీందర్ రెడ్డి అన్నారు.
వివేకావర్ధిని డిగ్రీ కళాశాలలో ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ‘ప్రేరణ – అవగాహన తరగతులు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లు చేయవద్దని, పరీక్షలకు సంబంధించి సందేహాలుంటే ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కోరారు. అనంతరం నిపుణులతో ఆయా సబ్జెక్టులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమాధికారి రవీందర్, వసతి గృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.