మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ చెన్నూర్, మార్చి 11 : ‘రేషన్ బియ్యం దందాకు మీ కాంగ్రెసోళ్లు అడ్డువస్తున్నరు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వ్యవహారాలన్నీ తామే చూసుకుంటున్నమని చెబుతున్నరు. అక్రమ వ్యాపారం నడువాలంటే డబ్బులివ్వాల్సిందేనని బెదిరిస్తున్నరు.’ అని మార్చి 7న సిరోంచకు చెందిన వీరన్న(వీరప్పన్).. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి ఫిర్యాదు చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
చెన్నూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ను రేషన్ దందా వీరన్న కలవడం హాట్ టాపిక్‌గా మారిన విషయం విదితమే. ఇటీవల వాహనాల్లో బియ్యం తరలిస్తుండగా కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేశారని ఆ యన నేరుగా ఎమ్మెల్యే వివేక్‌ను కలిసి వివరించారు. ఎవ్వరెవ్వరు డబ్బులు అడిగారో పేర్లతో సహా చెప్పడం ఆ పార్టీలో కలకలం రేపుతున్నది. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన విషయమై పలు పత్రికల్లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.
వీరన్న ఇతర పనుల కో సం ఎమ్మెల్యే వివేక్‌ను కలిసారే తప్ప.. ఎవరిపై.. ఎలాంటి ఫిర్యా దు చేయలేదని, ఇది బీఆర్ఎస్ నాయకుల కుట్ర అంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్‌ను కలిసి ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మరి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడేమని సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.