మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బెల్లంపల్లి, మార్చి 24 : గత పాలకుల పట్టింపులేనితనంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధతో గడప గడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చేరుతున్నాయి. బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన ఇండ్ల పట్టాల పంపిణీ సైతం తుది దశకు చేరింది. గడిచిన తొమ్మిదేళ్లలో వందల రూ. కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టగా, రూపురేఖలు మారిపోయాయి.
వైద్యానికి మంచిర్యాలకు పోవాల్సిన అవసరం లేకుండా పోయింది. బెల్లంపల్లిలోనే 100 పడకల దవాఖాన అందుబాటులోకి వచ్చింది. డయాలసిస్ కేంద్రం ఏర్పాటైంది. మరో 20 హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతున్నది. గురుకుల పాఠశాలలతో నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. అనేక చోట్ల వాగులు.. వంకలపై వంతెనలు, పల్లె పల్లెకూ బీటీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థను మెరుగు పరిచారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రగతిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
Tht
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి..
ప్రజలందరి దీవెనలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. బంగారు బెల్లంపల్లిగా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా. పల్లె పల్లెకూ రోడ్లు నిర్మించాం. వాగులపై వంతెనలు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగు పరిచాం. బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన ఇండ్ల పట్టాల పంపిణీ కొలిక్కి వచ్చింది. త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 30 పడకల దవాఖానను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరయ్యాయి. ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, పకృతివనం, రైతువేదికలు ఏర్పాటు చేశాం. ‘మన ఊరు-మన బడి’ ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం. విద్య, వైద్యం, రోడ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటింటికీ తాగునీరు.. ఇలా చెప్పుకుంటూ పోతే వందల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులు చేపట్టాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మార్గనిర్దేశంలో బెల్లంపల్లి ప్రగతికి నిరంతరం తపిస్తా. – దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే
వైద్యం బలోపేతం..
నియోజకవర్గ కేంద్రంలో రూ.16 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించారు. గతంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 పడకలతో అరకొర వైద్యం అందేది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో వంద పడకల దవాఖానను తీసుకువచ్చారు. ఇక్కడే డయాలసిస్ కేంద్రం సైతం ఏర్పాటు చేశారు. కాసిపేట మండలంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.30 కోట్లతో కొత్త భవనం నిర్మించారు. దుబ్బగూడెం, కాసిపేట, లంబాడీ తండాల్లో హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు నియోజకవర్గంలో మరో 20 హెల్త్ సబ్ సెంటర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనులు నడుస్తున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలో మారుమూల పల్లె ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందుతుంది అనడంలో సందేహం లేదు. నెన్నెల మండలం ఆవడం, చిత్తూపూర్, నెన్నెల మండల కేంద్రంలో వైద్య సిబ్బందికి ప్రత్యేక క్వార్టర్స్ నిర్మించారు. తాండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొత్త భవనం నిర్మిస్తున్నారు. రేచిని హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, అచ్చులాపూర్ సబ్‌సెంటర్ నిర్మాణం కొనసాగుతున్నది. వేమనపల్లి మండలంలో జిల్లెడ, నీల్వాయి, ముల్కలపేట సబ్సెంటర్లను ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా ఆధునీకరించారు. బెల్లంపల్లిలోని తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఆయాచోట్ల కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
బ్రిడ్జిల నిర్మాణంతో తీరిన రవాణా కష్టాలు..
బెల్లంపల్లి నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 22 వంతెనలు నిర్మించారు. వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో పలుచోట్ల రూ.77 కోట్లతో బ్రిడ్జిలు నిర్మించారు. వేమనపల్లి మండలంలో రూ.8 కోట్లతో నీల్వాయి వంతెన పూర్తి చేశారు. 20 గ్రామాల ప్రజలు చెన్నూర్‌కు వెళ్లడానికి మార్గం సుగుమమైంది. గొర్రెపల్లి వంతెనతో పాటు అవసరమున్న చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. భీమిని మండలం ఎర్రవాగుపై డీఎంఎఫ్టీ నిధులు రూ.4 కోట్లతో, పెద్దవాగుపై రూ.4 కోట్లతో పెద్దపేటకు వెళ్లేందుకు బ్రిడ్జిలు నిర్మించారు. తాండూర్ మండలంలో దశాబ్దాల కలగా ఉన్న గంపలపల్లి బ్రిడ్జిని రూ.37 లక్షలతో నిర్మిస్తున్నారు. దీంతో అచ్చులాపూర్ గ్రామ ప్రజలకు మార్గం సుగమం కానున్నది. నెన్నెల మండల ప్రజల సౌకర్యార్థం రూ.3 కోట్లతో కోనంపేట, కృష్ణపల్లి మార్గంలో మూడు బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. కాసిపేట మండలంలో దేవాపూర్, చింతగూడ గ్రామాల మధ్య సల్పల వాగుపై, దేవాపూర్, గట్రావ్‌పల్లిలో రాళ్లవాగుపై నిర్మించిన బ్రిడ్జిలతో రవాణా కష్టాలు తొలిగిపోయాయి. నాడు చిన్నపాటి వర్షాలకే వాగులు.. వంకలు ఉప్పొంగి పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేటివి. నేడు ఆయా గ్రామాలకు రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
అధునాతన వసతులతో గ్రంథాలయం..
బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున రూ.75 లక్షలతో గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా రీడింగ్ రూంలు ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు కల్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో త్వరలో ఏసీ సౌకర్యం కూడా కల్పించనున్నారు. పాఠకులకు అవసరమైన ఫర్నిచర్‌ను మంజూరు చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించారు. నూతన భవనం ఏర్పాటు చేసి పోటీ పరీక్షల అభ్యర్థులు, పాఠకుల కోసం వందల పుస్తకాలు అందుబాటులోనికి తీసుకువచ్చారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో 80వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానికంగా కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి 75 రోజుల పాటు ఉచిత శిక్షణ నిచ్చారు. గ్రూప్ 1, 2, 3, 4, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుమారు 250 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత భోజన సదుపాయం, స్టడీ మెటీరీయల్స్‌ను కూడా అందించారు. పట్టణంలోని టీసీవోఏ క్లబ్ ఆవరణలోని టీటీడీ కల్యాణ మండప సమీపంలోని సువిశాలమైన ప్రదేశంలో ఈ శిక్షణ కొనసాగింది.
శ్మశాన వాటికలు
బెల్లంపల్లి పోచమ్మ చెరువు సమీపంలో రూ. కోటితో, 24వ వార్డులో రూ.30 లక్షలతో అధునాతనమైన శ్మశాన వాటికలను నిర్మించారు. 10వ వార్డుకు సైతం శ్మశాన వాటిక మంజూరైంది. కాంటా చౌరస్తా, మున్సిపాలిటీ చౌరస్తాల్లో వాటర్ ఫౌంటేయిన్లతో పాటు సుందరీకరణ పనులు చేపట్టారు. రూ.5 కోట్లతో బెల్లంపల్లిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరకు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు వేశారు. సరస్వతీ శిశుమందిర్ నుంచి రవీంద్రనగర్ వరకు రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ముస్లింల కబరస్థాన్ కోసం రూ.5 లక్షలు, క్రిస్టియన్ల శ్మశాన వాటికకోసం మరో రూ.5 లక్షలు మంజూరయ్యాయి.
మిషన్ భగీరథతో తీరిన తాగునీటి వెతలు..
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.31 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేశారు. మూడు వాటర్ హెడ్ ట్యాంకులు, వార్డుల్లో అంతర్గత పైపు లైన్ నిర్మించారు. కాసిపేట మండలంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, పంప్‌హౌజ్‌తో పాటు రొట్టపల్లి చౌరస్తాలో పంప్ హౌజ్ ఏర్పాటు చేశారు. నెన్నెల మండలంలో 19 గ్రామపంచాయితీల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు, పంప్ హౌజులతో 80 శాతం నీటిని పంపిణీ చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాక ముందు ఉన్న బిందెల కొట్లాట తగ్గింది. నీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లే పరిస్థితి పూర్తిగా మారింది.
మారిన ముఖ చిత్రం
బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. మంత్రి కేటీఆర్ ఇచ్చిన రూ.15 కోట్లతో పాటు ఇతర నిధులతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. రూ.14 కోట్లతో కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్ ఏరియా వరకు నాలుగు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్లలో 11 జంక్షన్లను అభివృద్ధి చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణంలోని 34 వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ప్రతి వార్డులో ఎల్ఈడీ లైట్లతో పాటు, రద్దీ ఉండే ప్రదేశాల్లో నాలుగు బస్ షెల్టర్లను కట్టించారు. పోలీసుల ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఎడ్యుకేషన్ హబ్..
బెల్లంపల్లి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ, బాలుర గురుకుల కళాశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ నాలుగేళ్ల క్రితం గుర్తింపు పొందింది. బాలికల గురుకుల కళాశాల ఇంటర్ కళాశాలగా అప్‌గ్రేడ్ అయ్యింది. కాసిపేట బాలుర గురుకుల కళాశాల సైతం బెల్లంపల్లిలోనే ఉండడం, సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్సియల్ కళాశాల ఉండడంతో బెల్లంపల్లి ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దుకున్నది. నియోజకవర్గంలో దాదాపు రూ.80 కోట్లతో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్ల భవనాల నిర్మాణాలు జరిగాయి. కాసిపేట మండలంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న మోడల్ స్కూల్‌కు రూ.2.70 కోట్లతో, హాస్టల్‌కు రూ.1.18 కోట్లతో పక్కా భవనాలు నిర్మించారు. మండలంలో రూ.2.25 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కాలేజీని సైతం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో మన ఊరు -మన బడి పథకంలో సర్కారు పాఠశాలలను బాగు చేశారు. తాండూర్ మండలం గోపాల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో అదనపు గదులు, ప్రహరీ నిర్మాణం పూర్తయ్యింది. ఇక్కడ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అదనపు తరగతి గదులను నిర్మించారు. నెన్నెల మండలంలో 7 ఎంపీపీఎస్, 4 జడ్పీఎస్ఎస్ పాఠశాలలను రూ.2.37 కోట్లతో ఆధునీకరించారు. కన్నెపల్లి మండలంలో రూ.3.35 కోట్లతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
పట్టాలిచ్చి చూపించిన సర్కారు
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టాలు అందజేశారు. సింగరేణి క్వార్టర్లు, ఖాళీ స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న వారికి పట్టాలు అందాయి. 4200 దరఖాస్తులను రెవెన్యూ అధికారులు ఆమోదించి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. రోజుకు 50 మందికి చొప్పున దాదాపు ఇప్పటికీ వెయ్యి మందికి రిజిస్ట్రేషన్ పూర్తయింది. కాగా ప్రభుత్వం వీరికి మరో అవకాశం ఇచ్చింది. పట్టాలు పొందేందుకు గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మూడు నెలల గడువు ఇచ్చింది. దీంతో బెల్లంపలి పట్టణంలోని వారితో పాటు ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెల్లో మెరుస్తున్న రోడ్లు..
బెల్లంపల్లి-వెంకటాపూర్,తాండూర్-భీమిని,తాళ్లగురిజాల-నెన్నెల మండలాల మధ్య డబుల్ రోడ్లు నిర్మించారు. నియోజకవర్గంలోని మండలాల్లో రోడ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు రూ.200 కోట్ల విలువైన బీటీ రోడ్లు ఇప్పటి వరకు మంజూరయ్యాయి. తాండూర్ మండలంలోరూ.1.80 కోట్లతో కొత్తపల్లి-కిష్టంపేట-ద్వారకాపూర్ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. వేమనపల్లి మండలంలో రూ.11 కోట్లతో 4 కిలో మీటర్ల మేర మండల కేంద్రం నుంచి బుయ్యారం వరకు రోడ్డు పడింది. కాసిపేట మండలంలో పెద్ద ధర్మారంలో రూ.4 కోట్లతో రోడ్డు, దేవాపూర్‌లో రింగు రోడ్డు నిర్మించారు. నెన్నెల మండలంలో 2016లో జంగాల్‌పేట వరకు బీటీ రోడ్డు వచ్చింది. భీమిని మండలంలో వెంకటాపూర్, తిమ్మాపూర్ మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయింది. కన్నెపల్లి మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి పోలంపల్లికి, వీరాపూర్‌కు రోడ్లు నిర్మించారు. నియోజకవర్గంలోని ఎస్టీ గ్రామాల్లో బీటీ రోడ్లకు గిరిజన సంక్షేమ విభాగం నుంచి రూ.11 కోట్ల 49 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి వేమనపల్లి మండలాల్లో 11 బీటీ రోడ్లు నిర్మించనున్నారు. తాండూర్ మండలంలో మూడు, నెన్నెల మండలంలో మూడు, బెల్లంపల్లి, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు ఒకటి చొప్పున రోడ్లు మంజూరయ్యాయి.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. కమ్యూనిటీ హాళ్లు..
మున్సిపాలిటీలో 160 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి పక్కా భవనం నిర్మించారు. రూ. మూడున్నర కోట్లతో నెన్నెల-జంగాల్పేట్ చెక్ డ్యామ్ నిర్మించారు. బెల్లంపల్లి పట్టణంలో ఒక్కో కమ్యూనిటీ హాల్‌కు రూ.25 లక్షల చొప్పున మొత్తం ఆరు కమ్యూనిటీ హాళ్లు కట్టారు. ఇవేగాకుండా వేమనపల్లి-లక్ష్మీపూర్, భీమిని, కన్నెపల్లి-నాయకునిపేట మూడు విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించారు.
ఓపెన్ జిమ్‌లు..
నియోజకవర్గంలోని 3 మేజర్ గ్రామ పంచాయతీల్లో రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.65 లక్షలతో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని వన్గ్రౌండ్లో రూ.25 లక్షలతో ఓపెన్ జిమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
వంతెనతో ఏండ్లనాటి సమస్య తీరింది
వేమనపల్లి మండలం గొర్లపల్లి వాగుపై నిర్మించిన వంతెనతో ఇబ్బందులు పోయినయ్. 14 పంచాయతీలుండగా, ఇందులో 11 పంచాయితీల ప్రజలు చెన్నూర్ మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ వాగుపై నుంచే ప్రయాణించాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణం చేపట్టకముందు వాగు ఉప్పొంగితే రవాణా ఎక్కడికక్కడ స్తంభించేది. రెండు మూడు రోజుల వరకు సంబంధాలు తెగిపోయేవి. చెన్నూర్ నుంచి రాకపోకలు సాగించే ప్రభుత్వ అధికారులు సైతం పడవల ద్వారా గ్రామాలకు వచ్చే వారు. రైతులు వర్షాకాలం ముందు ఎరువులు, విత్తనాలు, ఇతర పంట సామగ్రి కొనుగోలు చేసి ఇండ్లలోనే భద్రపరుచుకునేవారు. గొర్లపల్లి, దస్నాపూర్, వేమనపల్లి, నాగారం, సుంపుటం, కల్లెంపల్లి, సూరారం,జిల్లెడ,బుయ్యారం,రాగారం, చామనపల్లి గ్రామస్తుల ఏళ్ల నాటి సమస్య బ్రిడ్జితో తీరినట్లయింది.
– మోర్ల మొండి, వేమనపల్లి
ఎర్రవాగు బ్రిడ్జితో కష్టాలు తీరినయ్
భీమిని మండలంలోని ఎర్రవాగుపై బ్రిడ్జి నిర్మించడంతో కష్టాలు తీరినయ్. గతంలో ఎర్రవాగు ఉప్పొంగితే వడాల, పెద్దపేట, భీమని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. నేను బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా. ఇది వరకు వాగు ఉప్పొంగితే పోవుడు వీలయ్యేది కాదు. ఇగ ఇప్పుడు ఆ బాధ లేకుంటైంది. బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సార్‌కు కృతజ్ఙతలు.
– రియాజ్, ఇంటర్విద్యార్ధి, భీమిని, వడాలగ్రామం
పట్టాలు వస్తాయనుకోలేదు
బెల్లంపల్లి పట్టణంలో చిన్నచిన్న ఇండ్లు కట్టుకొని ఉంటున్నం. పట్టాలు ఇవ్వరని అనేక మంది మంచిర్యాలకు పోయి ఇండ్లు కట్టుకున్నరు. పట్టాలు లేకపోవడంతో ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందయ్యేది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చొరవతో పట్టాల కల నెరవేతున్నది. ఇప్పటికే డిమాండ్ నోటీస్ అందుకున్నాం. గడువులోగా రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌కు వెళ్తాం. అసలు పట్టాలు వస్తాయని అనుకోలేదు.
– చాపిడి లక్ష్మణ్, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు
సకల సౌకర్యాలతో గ్రంథాలయం
పాత క్లబ్ పాఠశాలలోని గ్రంథాలయంలో బిక్కుబిక్కుమంటూ చదువుకున్నాం. స్లాబ్ ఎప్పుడు కూలుతుందోనన్న భయం ఉండేది. కొత్త భవనం మంజూరైంది. సకల సౌకర్యాలతో నిర్మించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే మాలాంటి వారికి ఇది వరంగా భావిస్తున్నాం. బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఐదేండ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో సెలవు పెట్టి మరీ ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్-2లో జాబ్ కొట్టడమే నా లక్ష్యం. – మహ్మద్ అఫ్రీద్, అభ్యర్థి