భైంసాటౌన్, ఫిబ్రవరి 23 : రంగారావు పల్సికర్ ప్రాజెక్టు ముంపు గుండేగాం వాసుల పునరావాసానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. భైంసా మండలం గుండేగాం గ్రామానికి గురువారం ఆయన సందర్శించారు. ముందుగా పట్టణ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. ప్రాజెక్టు ముంపు కాణంగా అందులో తాత్కాలికంగా నివాసం ఉంటున్న గుండేగాంవాసులతో మాట్లాడారు. మార్చి మొదటి వారంలో అధికారులు గ్రామంలో పర్యటించి, అభిప్రాయాలు సేకరిస్తారని తెలిపారు. అక్కడి నుంచి గుండేగాం గ్రామానికి చేరుకొని గ్రామాన్ని పరిశీలించి, మండల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల అభిప్రాయ సేకరణ అనంతరం పునరావాసం రెండు రకాలుగా ఉండేలా అవకాశం ఉందని తెలిపారు.
ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తే గ్రామంలో సకల సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అది కుదరకపోతే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే వారికి నగదు రూపంలో సాయం అందేలా చూస్తామని తెలిపారు. అనంతరం గుండేగాంవాసుల కోసం పట్టణ సమీపంలోని మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని పరిశీలించారు. ఇక్కడ సౌకర్యాలు తెలుసుకున్నారు. పరీక్షలు చేసే విధానంపై ఆరోగ్య సిబ్బందిని అడిగారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన అద్దాలు, మందుల పంపిణీ రికార్డులను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో రవికుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో గోపాల కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారులతో సమీక్ష..
నిర్మల్ టౌన్, పిబ్రవరి 23 : రెవెన్యూ అధికారులతో కలెక్టర్ వరుణ్రెడ్డి గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ధరణి నిర్వహణ తీరు, భూముల, పోడు భూముల సర్వే గుర్తింపు, తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. రెవెన్యూ అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండి, ధరణి సమస్యలను పరిష్కరించాలన్నారు. ధరణిలో వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.