మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 13 : మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్కు అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కోట్లాది రూపాయల నిధులున్నా అధికారులు, పాలకుల పట్టింపులేని తనంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది. సువిశాలమైన 47 ఎకరాల రాముని చెరువు స్థలంలో పార్కు ఏర్పాటు చేసేందుకు 2022లో టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.3.50 కోట్లు మంజూరయ్యాయి. పనుల చేజిక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ కొంతమేర పనులు చేపట్టి.. ఆపై బిల్లులు రావడం లేదన్న కారణంతో నిలిపివేశాడు.
కొన్ని పనులు మాత్రమే..
రూ. 3.50 కోట్లతో పార్కులో అభివృద్ధి పనులతో పాటు సుందరీకరణ పనులు చేపట్టాలని అప్పటి కౌన్సిల్ నిర్ణయించింది. రాముని చెరువు కట్ట, 2620 రన్నింగ్ మీటర్ల రెయిలింగ్, 1450 రన్నింగ్ మీటర్ల పాత్వేల నిర్మాణం, చెరువు కట్టపై గ్రీనరీ పెంచడం, కట్ట చుట్టూ 30 ఎల్ఈడీ స్తంభాలు, బతుకమ్మ ఆడే ప్రాంతంలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు చేయడం, బతుకమ్మ ఘాట్, వాహనాల పార్కింగ్ ఏరియా, సర్కులర్ బండ్ పోర్షన్వంటివి నిర్మించాల్సి ఉంది. కానీ, చెరువుకట్టకు రివిటింగ్, రెయిలింగ్, కట్టపై మట్టి పోయడంలాంటి పనులనే పూర్తిచేశారు. మిగిలిన పనులన్నీ అలాగే వదిలేశారు. అధికారులు, పాలకులు నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోగా, స్థానిక ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది. ఇకనైనా స్పందించి పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
పార్కు అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలి
పార్కు పనులను వెంటనే ప్రారంభించాలి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు వెంటనే ఆదేశాలివ్వాలి. మూడేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడానికి కారకులైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. రాముని చెరువు కట్టపై ప్రతి రోజూ 300 మందికి పైగా వాకింగ్ చేస్తుంటారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పనులు ప్రారంభించక పోతే రాముని చెరువు వాకర్స్, సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం, సీనియర్ సిటిజన్స్ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం.
– గజెల్లి వెంకటయ్య,
2001లో 47 ఎకరాలు అప్పగింత..
2001లో అప్పటి రెవెన్యూ అధికారులు దాదాపుగా 47 ఎకరాల రాముని చెరువు స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ఆ సమయంలో చెరువు చుట్టూ కట్ట నిర్మించి, మొక్కలు నాటి, ఫుట్పాత్ ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలను అమర్చారు. పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కు నిర్మించారు. కొద్దిరోజుల తర్వాత పార్కు ఆలనాపాలనా మరచిపోయారు. ఆపై ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఉదయం వాకింగ్కోసం కొందరు రాముని చెరువు కట్టను ఉపయోగిస్తున్నారు. కానీ ప్రజలకు ఉల్లాసం పంచడంలో ఆ పార్కు పనికి రాకుండా పోయింది.