జైపూర్, నవంబర్ 26 : నేరాల కట్టడికోసం సమష్టిగా కృషి చేయాలని రామగుండం పోలీస్‌కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాల జోన్ జైపూర్ ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను దర్యాప్తు చేయాలని సూచించారు. జైపూర్ సబ్‌డివిజన్ పరిధిలో మావోయిస్టు ప్రభావిత గ్రామాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో నిఘా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు వేణుచందర్, సుధాకర్, రవీందర్ పాల్గొన్నారు.
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మంచిర్యాల అర్బన్, నవంబర్ 26 : మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. 2021 నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన 65 కేసుల్లో నిందితుల నుంచి సీజ్ చేసిన 521.544 కిలోల (సుమారు రూ.1,30,38,600 విలువ) గంజాయిని కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ వద్ద నిబంధనలు పాటిస్తూ దహనం చేశారు.