
మంచిర్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ );మంచిర్యాల గంగపై నిర్మించిన రైల్వే వంతెన వందేళ్లు పూర్తి చేసుకున్నది. కాజీపేట-బల్లార్షా సెక్షన్లో భాగంగా నిజాం సర్కారు 1921-24 మధ్య కాలంలో దీనిని పూర్తి చేయగా, నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తున్నది. డంగ్ సున్నంతో మొత్తం 42 పిల్లర్లు ఏర్పాటు చేయగా, ఇందులో 21 పిల్లర్లు ఉమ్మడి ఆదిలాబాద్, మరో 21 పిల్లర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. గోదావరి నదిపై చేపట్టిన వంతెనల్లో ఇదే అత్యంత పొడవైనదని (2 కిలోమీటర్లకు పైగా) ఇంజినీర్లు చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇటీవల ఈ బ్రిడ్జిపై పరీక్షలు నిర్వహించి వేగ పరిమితిని 100 కిలోమీటర్లకు పెంచింది. ఇంతటి ధృడమైన.. చారిత్రాత్మక కట్టడం ఉండడం జిల్లాకే గర్వకారణమని ప్రజానీకం కొనియాడుతున్నది. –
మంచిర్యాల పట్టణం గోదావరి నది ఒడ్డున ఉత్తర భాగంలో ఉంది. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. మంచిర్యాల రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆధునీకరిస్తున్నది. ఈ రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన పట్టణాలకు సమీపంలో ఉండడంతో నిత్యం వచ్చీపోయే ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌కు చెందిన రామగుండం తర్వాత కాజీపేట-బల్లార్షా విభాగంలో మంచిర్యాల మూడో అత్యంత రద్దీ స్టేషన్. పొడవైన రైల్వే మార్గంలో మంచిర్యాల ఉంది. దీనిని గ్రాండ్ ట్రంక్ లైన్ అని పిలుస్తారు.
మంచిర్యాల గోదావరి నది(గంగ)పై నిర్మించిన రైల్వే వంతన వందేళ్లు పూర్తి చేసుకుంది. 1870 నుంచి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టింది. మొదట పత్తి పరిశ్రమ అవసరాలకు, కూలీల తరలింపు కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్ర వాడి వరకు రైల్వే లైన్ వేశారు. అనంతరం కాజీపేట నుంచి మహారాష్ట్ర బల్లార్షా వరకు కొత్త లైన్ వేశారు. 1924లో మొదటి రైలు ఈ సెక్షన్లో నడిచింది. కాగా, కాజీపేట-బల్లార్షా సెక్షన్లో భాగంగా మంచిర్యాల గోదావరి నది మీద 1921-24 మధ్య కాలంలో బ్రిడ్జిని నిర్మించారు. గుజరాతీ నుంచి వచ్చి మంచిర్యాలలో స్థిరపడ్డ కర్షన్లాల్ కుటుంబం ఏడు పిల్లర్లు మంచిర్యాల వైపు నిర్మించింది. మిగితావి ప్రభుత్వ ఇంజినీర్ల ఆధ్వర్యంలో పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు మూడేళ్లు పట్టింది. బ్రిడ్జి నిర్మాణం నిజాం కట్టడాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగింది. మొత్తం 42 పిల్లర్లను నిర్మించారు. ఇందులో 21 పిల్లర్లు ఉమ్మడి ఆదిలాబాద్, మరో 21 పిల్లర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ఈ రైల్వే వంతెన నాగ్‌పూర్ -విజయవాడ ప్రధాన మార్గంలో మంచిర్యాల, రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య ఉంది. రాష్ట్రంలో గోదావరిపై ఉన్న వంతెనల్లో అత్యంత పొడవైనది ఇదే కావడం గమనార్హం. రెండు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఇప్పటికీ ధృడంగా ఉంది. గోదావరి నదిని దాటుతున్నపుడు రైళ్లు నెమ్మదిగా వెళ్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నది పూర్తిగా ప్రవహిస్తున్నప్పుడు వీక్షించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతుంటారు. రైల్వే బ్రిడ్జికి సైడ్ సపోర్టివ్ గ్రిల్స్ లేకపోవడంతో కొంత ప్రమాదకరమైనది.
100 కి.మీ గరిష్ఠ వేగం..
కాజీపేట -బల్లార్ష సెక్షన్‌లోని మంచిర్యాల- పెద్దంపేట మార్గం ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ర్టాలకు ఎంట్రన్స్ గేట్లాంటిది. ఈ మార్గంలో ఉన్న గోదావరి వంతెనపై 100 కి.మీ గరిష్ఠ వేగంతో రైళ్లు పరుగులు పెట్టించేందుకు రైల్వే బోర్డు ఈ యేడాది జూన్‌లో ఓకే చేసింది. ఇప్పటి వరకూ మంచిర్యాల- పెద్దంపేట మధ్య (9 కిలోమీటర్ల దూరం) 80 కి. మీ, మధ్యలో గోదావరి వంతెన మీద గతంలో 50 కి.మీ గరిష్ఠ వేగ పరిమితి ఉంది. ఈ రైలు మార్గాన్ని పటిష్టం చేసి వేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రైలు వేగ పరిమితిని 100 కిలోమీటర్లకు పెంచారు. ఇక్కడి గోదావరి నదిపై గతంలో రెండు లైన్లు ఉండగా, మూడో ట్రాక్‌ను నిర్మించారు. మూడో వరుస 2018లో విజయవంతంగా పూర్తయ్యింది. వేగ పరీక్షలు విజయవంతం కావడంతో వేగపరిమితిని పెంచారు. వందేళ్లు దాటినా వంతెన కట్టడం చెక్కుచెదరకుండా ఉండడం నాటి ఇంజినీర్ల నైపుణ్యతకు తార్కాణమని జిల్లా వాసులు కొనియాడుతున్నారు.
అమృతం.. గంగాజలం..
హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. వేదకాలం నుంచి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని వినియోగిస్తున్నారు. జనన, మరణాల సమయంలో గంగాజలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం. అందుకే గంగా జలాన్ని తమ ఇండ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న గంగానదిపై పొడవైన బ్రిడ్జి కట్టడంతో మంచిర్యాల, పరిసరాల వాసులకు అనుబంధాల వారధిగా మారింది. గోదావరిపై నుంచి ప్రయాణించేటప్పుడు భక్తులు నేటికీ దక్షిణ రూపంలో నాణేలను గంగలో వేయడం, పూలు, అక్షింతలు చల్లడం కొనసాగిస్తుంటారు.
జిల్లాకే గర్వకారణం..
మంచిర్యాలలోని రైల్వే బ్రిడ్జి వందేళ్ల కిందటిది. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. సున్నపు రాయితో డంగు కట్టి పకడ్బందీగా నిర్మించారు. మంచిర్యాల రైల్వే గేట్ సమీపంలోని మార్వాడీ సామాజిక వర్గానికి చెందిన కర్షన్లాల్ కుటుంబం బ్రిడ్జి నిర్మాణంలో పాలు పంచుకున్నది. వీరు గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అప్పుడు నాకు 25 ఏండ్లు అనుకుంట. అంతర్గాంలో మా బంధువులు ఉండేవారు. నా ఫ్రెండ్స్‌తో కలిసి బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాళ్లం. ఈ బ్రిడ్జి వందేళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. గోదావరి, వరదలు, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడింది. ఇంతటి చారిత్రాత్మక కట్టడం ఉండడం జిల్లాకే గర్వకారణం. – నడిపెల్లి దివాకర్ రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల
వందేళ్లకు పైగా సేవలు..
మంచిర్యాల గంగపై రైల్వే బ్రిడ్జిని నాటి ఇంజినీర్లు తమ నైపుణ్యంతో చక్కగా కట్టారు. ఈ పురాతన కట్టడం వందేైళ్లెనా చెక్కుచెదరకుండా ఇప్పటికీ సేవలందిస్తున్నది. సాధారణంగా ఏ వంతెనైనా వందేళ్లు సర్వీస్ అందించేలా నిర్మిస్తుంటాం. వందేళ్లు గంగ రైల్వే బ్రిడ్జి బావుంది. వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది.