మంచిర్యాలటౌన్, మార్చి 24 : దేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తుండగా, అదే మంచిర్యాలలో మాత్రం ప్రజలను బెదిరించి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు (పీఎస్టీ) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు.
ప్రేమ్‌సాగర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుంచే వసూళ్ల పర్వానికి తెరతీశారని, గంజాయి బ్యాచ్‌ను అడ్డంపెట్టుకుని, ఇష్టారాజ్యంగా దాడులు చేయిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, మంచి మంచిర్యాలగా ఉన్న జిల్లా కేంద్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాలలోని ఉమర్ మియా హౌసింగ్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేసి, ఇండ్లు నిర్మించుకునే వారి నుంచి రూ. ఆరు లక్షల చొప్పున వసూలు చేశారన్నారు.
నస్పూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద 2023 డిసెంబర్ 10న కూల్చిన ఇండ్ల స్థానంలో ప్రస్తుతం మళ్లీ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని తెలిపారు. మంచిర్యాల వ్యాపారస్తుల దగ్గర దాదాపు రూ. 40 లక్షలు, ఒక వ్యాపారి బిల్డింగ్ కూలగొట్టకుండా ఉండడానికి రూ.10 లక్షలు, మరొక బిల్డింగ్ కూలగొట్టకుండా ఉండడానికి రూ. 50 లక్షలు చేతులు మారాయని చెప్పుకొచ్చారు.
లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని, ఇటిక్యాల చెరువు ఎఫ్టీఎల్ పరిధి అనే నెపంతో రూ. రెండు కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని అన్నారు. తప్పు చేసే అధికారులపై ఏనాటికైనా చర్యలు తప్పవని, ఆ విషయాన్ని అధికారులు గుర్తెరుగాలని సూచించారు.
బైపాస్ రోడ్డులో ప్రభుత్వ, ప్రైవేటు భూములు, బెల్లంపల్లి చౌరస్తా దగ్గర ప్రైవేటు భూమి, ఉమర్ మియా సొసైటీ లే అవుట్ పార్ స్థలంలో, తిలక్ నగర్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో, నస్పూర్ మున్సిపాలిటీలో ప్రేంసాగర్ రావు అనుచరులు అమ్మే భూములను ఎవరూ కొనవద్దని, ఎవరైనా అనుమతులు లేకుండా కొనుగోలు చేసినా, కట్టడాలు కట్టినా 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వాటిని కూలగొట్టే కార్యక్రమం ఉంటుందని, అందుకే ఈ విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మంచిర్యాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగును కూలగొట్టారని, అందులో బయటపడిన ఇనుపచువ్వలు, కాంక్రీటును అమ్ముకున్నారని ఆరోపించారు. చివరికి శ్మశాన వాటిక మెయింటెనెన్స్ కోసం మార్వాడి, వైశ్య వ్యాపారుల నుంచి, బంగారు దుకాణదారుల నుంచి నెలకు రూ. లక్ష చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారని, భయభ్రాంతులకు గురై వారు ఒప్పుకున్నారని తెలిపారు. శ్మశాన వాటికను మెయింటెనెన్స్ చేయాలని మున్సిపల్ అధికారులకు చెప్పి, వ్యాపారులనుంచి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో శ్మశాన వాటిక మెయింటెనెన్స్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మితిమీరిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు
గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయని, ప్రజలపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని దివాకర్‌రావు అన్నారు. ఈ విషయంలో కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయనపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి వారిపై పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.
విచిత్రంగా దాడికి గురై, తీవ్ర గాయాలపాలైన వారిపైననే కేసులు పెట్టడం, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని నేరుగా జైల్లో పెట్టడం ఇక్కడి పోలీసులకే చెల్లిందన్నారు. ప్రేమ్‌సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని వారికి గంజాయి అలవాటు చేసి వారితో దాడులు, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, అంకం నరేశ్, బేర సత్యనారాయణ, మొగిలి శ్రీనివాస్, అక్కూరి సుబ్బయ్య, కాటంరాజు, ఎర్రం తిరుపతి, తోట తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, శ్రీపతి వాసు పాల్గొన్నారు.