కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/ కెరమెరి, జనవరి 3 : గిరిజనులకు సాగులో అండగా నిలిచేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ‘గిరి వికాసం’ పథకాన్ని అమలు చేస్తున్నది. దీని ద్వారా గిరిజనులు సాగు చేసుకునే భూములకు సాగునీరు, విద్యుత్, తదితర వసతులను వంద శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో ఈ పథకానికి రూ. 6 కోట్లను కేటాయించింది. ఒక్కో యూనిట్ కు రూ. 3.50 లక్షలు ఖర్చు చేయనుండగా, గిరిజన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
జిల్లాలో గిరిజన రైతులకు సాగునీరు అందించేందుకు గిరివికాసం ద్వారా గిరిజన సంక్షేమ శాఖ రూ. 6 కోట్లను మంజూరు చేసింది. గిరిజన రైతులకు వంద శాతం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు బోర్లు వేసి సాగునీరందించేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తారు. జిల్లాలో చెరువులు, బోర్ల ద్వారానే అధికంగా వ్యవసాయం చేస్తుంటారు. బోర్లు వేసుకునే ఆర్థిక స్థోమత లేనివారు కేవలం వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
ఇలాంటి రైతులకు వంద శాతం రాయితీతో ప్రవేశపెట్టిన గిరివికాస పథకం వరంలా మారింది. బీడు భూముల్లో బోరు బావులు తవ్వించడం, విద్యుత్ కనెక్షన్లు ఇప్పించడం, మోటర్ల ద్వారా సాగునీరు అందించేందుకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. పదెకరాలకు ఒక యూనిట్‌ని అమలు చేస్తున్నారు. ఐదెకరాలు కలిగిన ఇద్దరు రైతులు లేక అంతకంటే తక్కువ భూమి కలిగిన ఇద్దరు లేక ముగ్గురు రైతులు పక్కపక్కన ఉన్నవారిని కలిపి ఒక యూనిట్‌ని అమలు చేస్తారు. గతంలో ఐడీటీఏ ద్వారా గిరిజన రైతుల భూముల్లో తవ్వి వదిలేసిన బావులను కూడా గిరి వికాసం ద్వారా వినియోగం లోనికి తీసుకువచ్చేందుకు అవకాశం కల్పించారు.
జిల్లాలో 1591 మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. 295 మంది రైతుల భూములను భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేశారు. 119 మంది రైతుల చేళ్లలో బోర్లు వేయించారు. 60 మంది రైతుల బోర్లకు విద్యుత్ వసతితోపాటు మోటార్లను బిగించారు. ఈ రైతులు 24 గంటల ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. మిగతా రైతులందరికీ మార్చిలోగా పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 3.50 లక్షల వరకు ఖర్చుచేస్తారు. ఈ పథకంలో కొలాం, మన్నేవార్, తోటి గిరిజనులకు ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
మా చేనుకు ఉచితంగా సాగునీటి వసతి కల్పించిన్రు. చాలా సంతోషంగా ఉంది. గిరి వికాసం ద్వారా రూపాయి కూడా ఖర్చులేకుండా సాగునీటి కోసం అన్ని వసతులు కల్పించిన్రు. మాకు ఉన్న ఐదెకరాల్లో గోధుమ పంట సాగు చేస్తున్నాను. గిప్పుడు వానకాలంలో పత్తి, కంది వేశాం. ఈ పంటలు తీసిన తరువాత బోరు నీళ్లతో ఇక నుంచి కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తాం.
– ఆర్ ప్రకాశ్, అనార్పల్లి, కెరమెరి మండలం
మాకు రెండున్నరెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇంత కాలం సాగునీటి వసతి లేకపోవడంతో పంటలు సరిగా పండించలేకపోయాం. ప్రభుత్వం గిరి వికాసం ద్వారా మాకు ఉచితంగా బోరు వేయించి కరెంటు వసతి కల్పించింది. దాదాపు రూ. మూడు లక్షలతో మాకు సాగు నీటి వసతి కల్పించింది. గిప్పుడు పూర్తిస్థాయిలో పంటలు పండించుకోగలుగుతున్నం. ప్రస్తుతం జొన్న పంట సాగు చేస్తున్న.
– జాదవ్ ధన్‌రాజ్, అనార్పల్లి, కెరమెరి మండలం