తాండూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సీఐటీయూ( CITU ) తాండూర్ మండల కన్వీనర్ దాగం రాజారాం ( Rajaram ) డిమాండ్ చేశారు. తాండూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మహాసభ లీలారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్స్ ( Labour Codes ) తెచ్చిందని ఆరోపించారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కార్మికులకు వేతనాలు పెంచుతామని గద్దెనెక్కి కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతి నెల వేతనాలు, ఇతర బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.
దసరా పండుగ వస్తున్నా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు, బిల్లులు చెల్లించకపోతే పండుగ ఎలా జరుపుకోవాలని ప్రశ్నించారు. సెప్టెంబర్ 19న వెంచర్ల పట్టణంలో జరిగే మధ్యాహ్నభోజన కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో కె విజయలక్ష్మి, డి సరిత, ఎం ప్రమీల, హనుమక్క, సత్యవతి, వరలక్ష్మి, జైనేని లక్ష్మి, బంగుబాయి, డి మల్లుబాయి, కే వెంకటమ్మ, బి లీల మగ్దుంబి, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.