ఆదిలాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పల్లెల్లో తాగునీటి సమస్యలు గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నిర్వహణ సరిగ్గా లేక తాగునీరు అందక గ్రామీణులు తిప్పలు పడుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాల బోరి గిరిజన గ్రామంలో 100 ఇండ్లు ఉండగా 500 జనాభా ఉంటుంది. గ్రామంలో ఫ్లోరైడ్ నీరు ఉండడంతో స్థానికులు మిషన్ భగీరథ నీటిని తాగుతారు. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు అరకొరగా వస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో గ్రామస్తులు వ్యవసాయ బావులపై ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. ఎడ్లబండ్లపై డ్రమ్ములతో పాటు కాలినడకన బిందెలు, డబ్బాల్లో నీరు మోసుకువస్తున్నారు. కొన్ని రోజులుగా రెండు, మూడ్రోజులకోసారి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని, అవి కూడా తక్కువగా వస్తుండడంతో తమ అవసరాలకు సరిపోవడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో వ్యవసాయ బావుల నుంచి నీటిని తీసుకువస్తున్నామని చెబుతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇంద్రవెల్లి, మార్చి 21 : ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామపంచాయతీ పరిధిలోని పాటగూడకు చెందిన కొలాం ఆదివాసీ గిరిజనులు బిందెడు నీటి కోసం కిలోమీటర్ల నడవాల్సి వస్తున్నది. సమక గ్రామపంచాయతీ పరిధిలోని పాటగూడలో 63 ఉమ్మడి కుటుంబాలు ఉండగా 450 మంది జనాభా ఉంది. తాగునీటి కోసం గతంలో అధికారులు ఓ వ్యవసాయ భూమిలో బోరుబావితో పాటు రెండు చేతి పంపులను ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రతకు బోర్లు, చేతిపంపులు అడుగంటిపోయాయి. మిషన్ భగీథర పథకం పైపులైన్ మధ్యలోనే పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. కొన్ని రోజులుగా తాగునీటికి కొలాం ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావులకు వెళ్లి నీటిని బిందెలు, క్యాన్లలో మోసుకువస్తున్నారు. ఆ బావిలోకి దిగి బిందెడు నీళ్లు తెచ్చేందుకు అనేక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడితో గ్రామాల్లో పెళ్లి వేడుకలు నిర్వహించాలంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపులైన్‌కు మరమ్మతులు చేసి ప్రతి రోజూ తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇంద్రవెల్లి, మార్చి 21 : తాగునీటి బాధలను అధికారులు పట్టించుకొని పరిష్కరించాలి. నా చిన్నప్పటి నుంచి తాగునీటి కష్టాలను పడుతూనే ఉన్నాం. గ్రామంలో నీళ్లు లేక దగ్గరల్లోని వ్యవసాయ బావుల నుంచి తాగునీళ్లు తీసుకోస్తున్నాం. ఇంటికి బంధువులతోపాటు చుట్టాలు కాని, ఎవరైనా వస్తే వారికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మాకు పీడిస్తున్న నీటి కష్టాలు తీర్చి ఆదుకోవాలి. గ్రామానికి చెందిన రెండు చేతిపంపులు అడుగంటిపోయినయ్. బావిలో దిగి నీళ్లను మోసుకురావాలంటే ఇబ్బందిగా ఉన్నది.
-కొడప లక్ష్మీబాయి, పాటగూడ
మా గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడంతో తాగునీటికి తీవ్ర పడుతున్నం. ఇంటింటీకి నల్లా కనెక్షన్లు ఉన్నా అవసరాలకు సరపడా నీరు సరఫరా కావడం లేదు. గ్రామంలో అందుబాటులో ఉన్న నీటిలో ఫ్లోరైడ్ ఉండడంతో ఆ నీటిని తాగడానికి ఉపయోగించడం లేదు. శుక్రవారం మి షన్ భగీరథ నీరు రాలేదు. మా అవస రాల కోసం నీటిని ఎడ్లబండ్లలో డ్రమ్ములు, బిందెలతో మోసు కుంటూ వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకుంటున్నాం. మా గూడెంలో నీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి.
– వసంత్, చిట్యాలబోరి, ఆదిలాబాద్ రూరల్ మండలం
మా గ్రామంలో 100 ఇండ్లు ఉన్నాయి. 500 వరకు జనాభా ఉంటుంది. ప్రతి ఇంటికీ నల్లా ఉన్నా మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడం తో ఇబ్బందులు పడుతున్నం. పొద్దంతా నీళ్లు మోసుకోవడానికే సమయం సరిపోతున్నది. వ్యవసాయ, ఇతర పనులు చేసుకోలేకపో తున్నాం. మా గూడెం సమీ పంలో కచ్కం టి వద్ద మిషన్ భగీరథ పైపు ప్రమాదక రంగా మారింది. వాగు నీటి ప్రవాహం తో పైపుల మీద సిమెంట్ దిమ్మెలు పాడయినయి. గతంలో భగీరథ నీరు బాగా వచ్చేది. ఈ సీజన్లో తాగునీటి సమ స్య ప్రారంభం కాగా ఇంకో రెండు నెలలు ఎలా ఉంటుందోనని భయమేస్తుంది.
-మనోహర్, గ్రామపటేల్, చిట్యాలబోరి, ఆదిలాబాద్ రూరల్ మండలం