నిర్మల్, జూలై 10(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. అరకొర సౌకర్యాల మధ్య కడెంలో కొనసాగుతున్న హరిత రిసార్టును ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తు ఇటీవల టూరిజం శాఖ ఎండీ ఉత్తర్వులు జారీ చేసింది. రిసార్ట్స్ నిర్వహణలో అనుభవమున్న బృందావన్ గార్డెన్స్ లేక్‌వ్యూ రిసార్ట్‌కు హరిత రిసార్ట్ నిర్వహణ బాధ్యతలను 33 ఏండ్ల పాటు అప్పగించింది. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియతోపాటు అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఇందులో భాగంగానే బృందావన్ యాజమాన్యం రిసార్ట్‌ను స్వాధీనం చేసుకుని ఆధునీకరణ పనులను మొదలు పెట్టింది. పర్యాటకులకు మంచి భోజన సౌకర్యం కల్పించేందుకు రెస్టారెంట్, పిల్లల కోసం ప్లేగ్రౌండ్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, ట్రెక్కింగ్, సఫారీ, ప్రాజెక్టులో ఫిషింగ్ వంటి సదుపాయాలను కల్పించనున్నారు. అయితే.. బృందావన్ సంస్థ రిసార్ట్ నిర్వహణతో వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా యేటా అన్ని రకాల పన్నులతో కలుపుకుని రూ.25 లక్షల వరకు టూరిజం శాఖకు చెల్లించాలి. ఈ అద్దెను యేటా నిర్దేశించిన పర్సంటేజీ ప్రకారం పెంచి ఇవ్వాలి
రాష్ట్ర నలుమూలల నుంచి కడెం అందాలను తిలకించేందుకు యేటా వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. వీరికి కనీస సౌకర్యాలు, భోజన వసతి లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రారంభంలో కొంత నిర్వహణ బాగానే ఉన్నప్పటికీ, అనంతరం టూరి జం శాఖ రిసార్ట్‌ను గాలికొదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. టీవీలు, ఏసీ సదుపాయం లేకపోవడం, పరిసరాలు కూడా పూర్తి అపరిశుభ్రంగా మారడంతో సందర్శకుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తున్న క్రమంలో రూపురేఖలు మారనున్నాయి. ప్రాజెక్టు వద్ద అటవీ శాఖ పరిధిలోని వ్యూ పాయింట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. దీంతో నిర్మల్ జిల్లాలోని కడెం మరో ఎకో టూరిజం స్పాట్‌గా మారనున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే జూన్ 22వ తేదీ న టూరిజం శాఖ ఎండీ కడెం హరిత రిసార్టు ను తమ సంస్థకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినట్లు బృందావన్ గార్డెన్స్ లేక్‌వ్యూ రిసార్ట్ సం స్థ చైర్మన్ పీ.రవీందర్రావు తెలిపారు. పదకొండేండ్ల క్రితమే ఇక్కడ రిసార్ట్‌ను నిర్మించేందుకు తమ సంస్థ టెండరు దక్కించుకున్నదని, కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వ చ్చిందన్నారు. జలయజ్ఞంలో భాగంగా 2013 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు ప్రాజెక్టుల వద్ద పీపీపీ (ప్రైవేటు పబ్లిక్ పార్టర్నర్షిప్) పద్ధతిలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నాటి ప్రభుత్వం టెండర్లను పిలిచిందని తెలిపారు. ఈ టెండర్‌ను తమ సంస్థ దక్కించుకు ని డిసెంబర్ 27, 2013న టూరిజం శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నదని వివరించారు.
అప్పట్లో టూరిజం శాఖ అధికారుల మధ్య స మన్వయం లేని కారణంగా నాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాం తాల అభివృద్ధికి వచ్చిన నిధులను కడెంకు మళ్లించి ఇక్కడ టూరిజం శాఖ హరిత రిసార్ట్ కట్టడానికి టెండర్లను పిలిచిందన్నారు. దీనికి తాము అభ్యంతరం తెలుపగా.. హరిత రిసార్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని, రిసార్ట్‌ను తామే నిర్మించి ఇస్తామని తమ సంస్థను అప్పటి పర్యాటక శాఖ ఎండీ కోరగా, ఇందుకు తాము అంగీకారం తెలిపామన్నారు. నిర్మాణానికి అయిన ఖర్చు కు గతంలో కుదుర్చుకున్న అగ్రిమెంటుపై 5 శాతం అదనంగా చెల్లించేందుకు ఒప్పుకున్నామని తెలిపారు.
ఆ తర్వాత క్రమంలో ప్రభుత్వాలు, అధికారులు మారిన కారణంగా సకాలంలో రిసార్టు అప్పగించకపోవడంతో 2015 లో కోర్టుకు వెళ్లగా జూన్ 30, 2015న బృం దావన్ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ తీర్పును అధికారులు బే ఖాతరు చేయడంతో అధికారులపై కోర్టు ధిక్కరణ కింద కేసు వేశామన్నారు. ఈ క్రమంలోనే 2021లో టూరిజం శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేయగా సెప్టెంబర్ 18, 2021న టూరిజం బోర్టులో నిర్ణయం తీసుకుని కడెం హరిత రిసార్ట్‌ను బృందావన్ సంస్థకు అప్పగించాలని ఆదేశాలిచ్చిందన్నారు. బోర్డు నిర్ణయం మేరకు ప్రభుత్వంలో మళ్లీ పునఃపరిశీలన జరిపిన అనంతరం అక్టోబర్ 6, 2023లో మా సంస్థకు అప్పగించాలని ఆదేశించింది.
ఆ తర్వాత సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్ కారణంగా అప్పగింత వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థపై మేము పెట్టిన కోర్టు కేసులను ఉపసంహరించుకునే షరతుపై జూన్ 22, 2024న హరిత రిసార్ట్‌ను తమకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు జూన్ 24, 2024న రిసార్టును స్వాధీనం చేసుకుని సంస్థపై పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నామన్నారు. త్వరలోనే ఇక్కడి రిసార్టును అన్ని హంగులతో తీర్చిదిద్ది పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని బృందావన్ గార్డెన్స్ లేక్‌వ్యూ రిసార్ట్ సంస్థ చైర్మన్ పీ.రవీందర్రావు వెల్లడించారు.
– పీ.రవీందర్రావు, బృందావన్ గార్డెన్ లేక్‌వ్యూ రిసార్ట్ సంస్థ చైర్మన్.