మంచిర్యాల ఏసీసీ, జూన్ 16 : రెండు రోజుల్లో కూతురి ‘సారీ ఫంక్షన్’ను తనకున్న స్థోమతకు తగ్గట్లు చేద్దామని అనుకున్నది ఆ తల్లి. తెలిసిన వారి దగ్గరి నుంచి రూ.80వేలు అప్పు తెచ్చింది. బంధువులు, తోటి ఉపాధ్యాయులకు, స్నేహితులను ఆహ్వానించింది. ఇంతలోనే ఆ తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రికి చెందిన మహేశ్, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు స్నేహశీల 2010 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెళ్లయిన కొద్దిరోజులకే వారి మధ్య గొడవలు జరిగాయి. మహేశ్ ఏ పని చేయపోవడంతో స్నేహశీల ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేది. ఆ తర్వాత మంథనిలో ఓ ప్రైవేట్ పాఠశాలను లీజుకు తీసుకొని భార్యభర్తలిద్దరూ నిర్వహించగా నష్టపోయారు. ప్రస్తుతం స్నేహశీల లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నది. భర్త మద్యానికి బానిసై స్నేహశీలను అనుమానించడంతో పాటు తన ఇంటి వద్ద నుంచి డబ్బులు తీసుకరావాలని నిత్యం వేధించేవాడు. ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్లో కూడా పంచాయితీలు జరిగాయి.
ఈ క్రమంలో రెండు రోజుల్లో కూతురి ఫంక్షన్ కోసం తెచ్చిన డబ్బులు తనకు ఇవ్వాలని, ఫంక్షన్ అవసరం లేదని శనివారం గొడవ చేశాడు. దీంతో మనస్తాపంతో స్నేహశీల శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల పట్టణ ఎస్ఐ మహేందర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతురాలికి కూతుళ్లు మనస్వీ, సమాఖ్య ఉన్నారు.