కాసిపేట : సీజనల్ వ్యాధులు (Seasonal Diseases ) ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కళాజాత కళాకారులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంతో పాటు చిన్న ధర్మారం, కోమటిచేను గ్రామాల్లో మంగళవారం కళాజాత( Kalajata) కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కలిగి ఉండడం, బాధ్యతగా ఓటు వేయడం అనే అంశాలపై ఓటు విలువ కోసం అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ముల్కల్ల మురళి, మామిండ్ల లచ్చన్న, లావుడ్యా రమేష్, వెళ్తురు పోశం, రామటెంకి రాజ తిరుపతి, గొడిసెల కృష్ణ, చేగొండ నిరోషా, మిట్టపల్లి సంధ్య, ఎండీ తస్లీమా సుల్తానా పాల్గొన్నారు.